- ఢిల్లీ సమీపంలోనూ మరొకటి
- రూ.1,000 కోట్ల పెట్టుబడి
- డైకిన్ డైరెక్టర్ సంజయ్ గోయల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నగరం చిత్తూరు శ్రీసిటీలోని తమ ప్లాంటులో ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఏసీల తయారీ కంపెనీ డైకిన్ డైరెక్టర్, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సంజయ్ గోయల్ చెప్పారు. హైదరాబాద్లో గురువారం తన డీలర్ శ్రీకంఫర్ట్స్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ- సమీపంలో రూ.1000 కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
‘‘ముడి సరుకుల ధరలు పెరగడం, కొత్త ఎలక్ట్రిసిటీ రేటింగ్స్ వల్ల ఏసీల ధరలను ఈ నెలలోనే ఏడు శాతం వరకు పెంచాం. 2026 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. దక్షిణ భారతదేశం నుంచి కంపెనీకి 25 శాతం కంటే ఎక్కువ ఆదాయం లభిస్తోంది”అని ఆయన వివరించారు. కంపెనీ రీజనల్ ప్రెసిడెంట్ కుటుంబ రావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఏడు డైకిన్ సొల్యూషన్ ప్లాజాలు ఉన్నాయని, వీటిని ఈ ఏడాది 50 శాతం మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

