ఆదిలాబాద్ టౌన్ (భీంపూర్), వెలుగు : విద్యుత్ వైర్లకు రిపేర్లు చేస్తుండగా కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ చనిపోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గురువారం జరిగింది. ఆదిలాబాద్‌రూరల్ సీఐ ఫణీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
తాంసి మండల కేంద్రానికి చెందిన అనిల్ పాటిల్ (39) భీంపూర్ మండలంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామం సమీపంలోని పంటపొలాల్లో బుధవారం రాత్రి 33 కేవీ విద్యుత్ వైర్లు తెగిపోయాయి.
దీంతో తాత్కాలికంగా మరో లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. తెగిపోయిన వైర్లకు రిపేర్లు చేసేందుకు గురువారం ఉదయం అనిల్ పాటిల్‌తో పాటు మరో ఉద్యోగి చంద్రశేఖర్ వెళ్లారు. ఇద్దరూ స్తంభంపైకి ఎక్కి రిపేర్లు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు షాక్ కొట్టడంతో అనిల్ స్తంభంపైనే చనిపోగా.. చంద్రశేఖర్ స్తంభం పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్‌ను రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో...
బీర్కూర్, వెలుగు : కరెంట్‌షాక్‌తో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో గురువారం జరిగింది. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేశ్ (27) తాను ఉంటున్న ఇంట్లో విద్యుత్ మోటార్‌ను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు షాక్ కొట్టింది. గమనించిన కుటుంబసభ్యులు బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా.. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.
సిద్దిపేట జిల్లాలో...
తొగుట (రాయపోల్), వెలుగు : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కిచ్చుగారి కనకయ్య (38) విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. కనకయ్య ఇంట్లో ఉన్న ఫ్యాన్ వైర్ తెగి పైనున్న ఇనుప రేకులకు తగిలింది. ఈ విషయాన్ని గమనించని కనకయ్య రేకులకు ఆనుకొని ఉన్న ఇనుప తీగను పట్టుకోవడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కనకయ్యను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

