దంతాలపల్లి వెలుగు : విద్యార్థులు చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, తమకు నైపుణ్యం ఉన్న సబ్జెక్టుల్లో పట్టు పెంపొందించుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్–టీచర్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం కీలకమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపే బాధ్యత తల్లిదండ్రులదేనని, చదువుతో పాటు క్రీడలు, నైతిక విలువలు కూడా నేర్పించాలని అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్, లైబ్రరీ వంటి కార్యక్రమాలను అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, వంటగదిని పరిశీలించి హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంఈఓ, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

