ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ'. కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఇందులో మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల కనిపించనుందని ఇటీవల రివీల్ చేయగా, గురువారం మరో పాత్రను పరిచయం చేశారు. ‘డర్టీ హరి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి ఈ చిత్రంలో సింహా క్యారెక్టర్ పోషిస్తున్నట్టు తెలియజేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చీకటి, పొగతో నిండిన నేపథ్యంలో, శ్రవణ్ రెడ్డి చేతిలో మండుతున్న కాగడాను పట్టుకుని ఉన్నాడు. ఇందులో తన పాత్ర చాలా కీలకమని మేకర్స్ చెప్పారు. 85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్‌తో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఎమ్మెస్ రాజు అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు.

