- హాజరు కాని వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయం?
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరేసిన డిప్యూటీ సీఎం సచిన్‌పైలెట్ మరోసారి సీఎల్పీ సమావేశానికి డుమ్మాకొట్టారు. పైలెట్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో హాజరు కానీ వాళ్లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారని సచిన్ పైలెట్ ప్రకటించగా.. 109 మంది తనతో ఉన్నారని అశోక్‌గెహ్లాట్ ప్రకటించారు. వాళ్లందర్నీ జైపూర్ శివార్లలోని హోటల్‌కు తరలించారు. మంగళవారం అక్కడే రెండోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేల్లో కూడా 20 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. పార్టీ పెద్దలు సచిన్‌తో మాట్లాడారని, ఆయన సీఎల్పీ సమావేశానికి హాజరు అవుతారని కొంత మంది పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ సచిన్‌పైలెట్ మీటింగ్‌కు రాకపోవడం గమనార్హం. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి సచిన్‌పైలెట్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడినా కూడా లాభం లేకుండా పోయింది.

