ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్  లో  సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకగా బతుకమ్మ సంబురాలు ముగిసాయి. తీరొక్క పూలతో మహిళలు వేడుకలు చేసుకున్నారు. బతుకమ్మలతో అమరుల స్థూపం దగ్గర తొలిపూజ చేశారు.  అమరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వరకూ 700 బతుకమ్మలతో  ర్యాలీ జరిగింది. ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు వచ్చారు. 500 మంది కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. డబ్బుల సౌండ్ తో బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండ్ దద్దరిల్లింది.  బతుకమ్మ లేజర్ లైట్ షో ఆకట్టుకుంది.

బతుకమ్మ  వేడుకలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్,   మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు,  మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పలువురు ప్రముఖులు  హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నా.  ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ.  తెలంగాణ ఏర్పడిన తర్వాత  ప్రజా ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ ఇది.  వరంగల్ లో చారిత్రాత్మక కట్టడం ముందు బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. గిన్నిస్ బుక్ లో మన బతుకమ్మ ను ఎక్కించాలనే తపనతో మన బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేశారు. ఇందుకోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు . ఎంతో కష్టం, శ్రమతో కూడుకున్నది.. రెండు, మూడు నెలల ముందు నుంచే ఇందుకోసం శ్రమించిన సాంస్కృతిక శాఖ వారికి అభినందిస్తున్నాను.  పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనది.. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు. తొమ్మిది రోజులు ఎంతో సంతోషంగా మహిళలు ఈ పండుగను జరుపుకున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా బతుకమ్మ వేడుకలు  చేసుకున్నారు. ఇప్పటి యువత  వెస్ట్రన్ కల్చర్లో బతుకమ్మ జరుపుకోవద్దు.మన సంస్కృతి ఆచారాలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలి అని అన్నారు.