
న్యూఢిల్లీ: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్–17 విమెన్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బరిలోకి దిగనుంది. భూటాన్‌లోని థింపులో ఈ నెల 20 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం హెడ్ కోచ్ జోకిమ్ అలెగ్జాండర్‌సన్ 23 మందితో కూడిన జట్టును ఆదివారం ప్రకటించాడు. జోకిమ్ కోచింగ్‌లోని ఇండియా అండర్–-20 జట్టు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఏఎఫ్‌సీ విమెన్స్ ఆసియా కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు అండర్-–17 జట్టుకు కూడా అతను మార్గనిర్దేశం చేయనున్నాడు. అక్టోబర్‌లో జరగనున్న ఏఎఫ్‌సీ అండర్17 విమెన్స్ ఆసియా కప్ క్వాలిఫైయర్స్‌కు ఈ టోర్నమెంట్ మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈసారి శాఫ్ అండర్17 టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇండియా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్.. డబుల్ రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడతాయి. ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో రెండుసార్లు ఆడుతుంది. లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును చాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ నెల 20న నేపాల్‌తో జరిగే తొలి పోరుతో ఇండియా తమ పోరు ఆరంభిస్తుంది.