
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సులో సంస్థ ఎండీ సజ్జనార్ ఆకస్మిక జర్నీ చేశారు. బుధవారం లక్డీకపూల్‌లో సాధారణ ప్రయాణికుడిలా బస్సెక్కారు. ఎంజీబీఎస్ దాకా ప్రయాణించారు. ఈ మధ్యలో ప్యాసింజర్లతో మాట్లాడారు. ఎంజీబీఎస్‌లో తనిఖీలు నిర్వహించారు. బస్ స్టేషన్లో టాయిలెట్లను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. బస్టాండ్ లో పరిసరాలు, టాయిలెట్లను నీట్‌గా ఉంచాలని సూచించారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీని పాటించాలన్నారు. పార్కింగ్ ప్లేసులో ఏండ్ల తరబడి ఉండిపోయిన వెహికల్స్‌ను వెంటనే స్క్రాప్ యార్డుకు తరలించాలన్నారు. యాడ్స్ ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్‌సోర్సింగ్ ఏజెంట్లకు అప్పగించాలని సూచించారు. ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుకునేందుకు పండుగలు, పెండ్లిళ్లకు బస్సులను కిరాయికి ఇవ్వాలని సూచించారు. దసరా పండుగకు టికెట్ల రిజర్వేషన్లను ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలని సజ్జనార్ ఆదేశించారు.