తమిళనాడులోని సేలం నగరానికి చెందిన 77 ఏళ్ల ఆర్. సుబ్రమణి తన ఆటోలో ప్రయాణించే వారికి ఎండ వేడి తగలకుండా ఒక సూపర్ ఐడియా వేశారు. వేసవిలో ఉక్కపోత నుంచి ప్రయాణికులకు రిలీఫ్ కలిగించడానికి తన ఆటోను 'నేచురల్ ఏసీ' వాహనంగా మార్చేశారు.
సుబ్రమణి ఐడియా ఏంటంటే.. ఆటో పైకప్పు నుండి వేడి లోపలికి రాకుండా ఉండేందుకు మొదట ఒక లేయర్ వేసి, దానిపై గడ్డిని, పచ్చి వరి గడ్డిని పేర్చారు. ఆటో పైకప్పుపై ఎప్పుడూ నీరు చిలకరించేలా ఒక చిన్న వాటర్ స్ప్రింక్లర్ అమర్చారు. ఈ వాటర్ స్ప్రింక్లర్ గడ్డిని తడుపుతూ ఉండటం వల్ల లోపల గాలి చాలా చల్లగా ఉంటుంది.
ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి ఏటా ఎండాకాలం రాగానే, తన ఆటోలో ఇలాంటి మార్పులు చేస్తూ ప్రయాణికులకు హాయిని కలిగిస్తున్నారు.
గత తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతున్న సుబ్రమణి, అంతకుముందు టైలర్‌గా పనిచేసేవారు. ప్రతిరోజు ప్రయాణికులతో పాటు స్కూల్ పిల్లలను కూడా సురక్షితంగా, హాయిగా చేరవేస్తుంటారు.
ఈ వయసులో కూడా ప్రయాణికుల కోసం ఆయన చూపిన శ్రద్ధ, కృయేటివిటీ చూసి సేలం ప్రజలు ఆయనను న్యాచురల్ ఏసీ తాత అని మెచ్చుకుంటున్నారు.

