జోరుగా ఇండ్ల అమ్మకాలు

జోరుగా ఇండ్ల అమ్మకాలు

జోరుగా ఇండ్ల అమ్మకాలు
మార్చిలో రూ.3,352 కోట్ల విలువైన యూనిట్ల సేల్

హైదరాబాద్, వెలుగు : నగరమంతటా రెసిడెన్షియల్​ ప్రాపర్టీల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్​లో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే సేల్స్​12 శాతం పెరిగాయి. మార్చిలో అమ్ముడైన ఆస్తుల మొత్తం విలువ రూ. 3,352 కోట్లు కాగా, ఇది కూడా నెలవారీగా 12.2శాతం పెరిగింది. అయితే  2022 మార్చితో పోలిస్తే మాత్రం ఈసారి మార్చిలో అమ్మకాలు ఐదు శాతం తగ్గాయి.  రియల్ ఎస్టేట్​కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు ద్వారా ఈ విషయాలు తెలిశాయి.  

హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి,  సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో రూ.25 – 50 లక్షల ప్రైస్​ బ్యాండ్‌లోని రెసిడెన్షియల్ యూనిట్లు 53శాతం ఉన్నాయి.  గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆస్తుల కేటగిరీలో రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతం ఉంది. 1,000–-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల వాటా అత్యధికంగా 70 శాతం వాటాతో ఉంది.   మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లు 42శాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 35శాతం రికార్డయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా ఈ ఏడాది మార్చిలో 14శాతంగా రికార్డయింది.   రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో వార్షికంగా10శాతం పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 15శాతం పెరిగాయి.  

 హోంలోన్ వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు బలంగానే కొనసాగాయి. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అత్యధిక రిజిస్ట్రేషన్లు ఇదే కేటగిరీ నుంచే జరిగాయి. ఎక్కువ స్థలం,  సౌకర్యాలు ఉన్న ఇండ్లకు గిరాకీ బాగుంది. 

‑ శామ్​సన్​ ఆర్థర్,​ నైట్ ఫ్రాంక్, ఇండియాలో సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్