మహ్మద్ సలీం@170 చోరీలు..1991 నుంచి వరుస దొంగతనాలు

మహ్మద్ సలీం@170 చోరీలు..1991 నుంచి వరుస దొంగతనాలు
  •     రెండుసార్లు పీడీ యాక్ట్ పెట్టినా మారలే
  •     ఘరానా దొంగను అరెస్ట్ చేసిన ఫలక్ నుమా పోలీసులు
  •     1.5 కిలోల బంగారం స్వాధీనం


హైదరాబాద్‌‌, వెలుగు: ఇరవై ఏండ్లుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ మహ్మద్ సలీం అలియాస్‌‌ సునీల్‌‌ శెట్టి(46)ని ఫలక్‌‌నుమా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.18 లక్షల 50 వేల విలువైన కిలో 500 గ్రాముల  బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో170 కేసుల్లో నిందితుడైన సలీం వివరాలను సిటీ సీపీ ఆనంద్‌‌ వెల్లడించారు. ఫలక్‌‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన మహ్మద్ సలీం 1991 నుంచి వరుస చోరీలు చేస్తున్నాడు. జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే మళ్లీ దొంగతనాలు చేసేవాడు. 2018లో కంచన్‌‌బాగ్‌‌, 2021లో చాంద్రాయణగుట్టలో పీఎస్‌‌లో నమోదైన కేసుల్లో పోలీసులు రెండు సార్లు అతడిపై పీడీ యాక్ట్‌‌ పెట్టి జైలుకు పంపారు. గతేడాది డిసెంబర్‌‌‌‌లో రిలీజ్‌‌ అయిన సునీల్ శెట్టి సిటీ, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 15 చోరీలు చేశాడు. ఇటీవల ఫలక్ నుమా పీఎస్ లో 3 చోరీ కేసులు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫింగర్ ప్రింట్స్, ఓల్డ్ అఫెండర్ డేటా ఆధారంగా సలీం ఈ దొంగతనాలు చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సలీంపై మరోసారి పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.