గోదావరి చుట్టుపక్కల రైతులను దెబ్బతీసిన ఇసుక క్వారీలు

గోదావరి చుట్టుపక్కల రైతులను దెబ్బతీసిన ఇసుక క్వారీలు
  • రూ.25 కోట్లకు పైగా నష్టం
  • 19 గ్రామాల్లోని 5 వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి
  • ఈ ఏడాది మిర్చి సాగు కష్టమే
  • పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతుల వినతి

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి/ వెంకటాపురం, వెలుగు: ఇటీవల వచ్చిన వరదలతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇసుక దిబ్బలుగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల పుణ్యమా అని రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఇసుక డంపులలో నిల్వ చేసిన ఇసుక అంతా వరదలకు కొట్టుకు వచ్చి పంట పొలాలను మింగేసింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లోని 19 గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల భూముల్లో ఇసుక మేటలు కన్పిస్తున్నాయి. రైతుల వ్యవసాయ పరికరాలు, మోటార్లు అన్నీ ఇసుకలో మునిగిపోయాయి. దీంతో రైతులకు ఒక్కో ఎకరానికి రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లింది. అంతా కలిపి రూ.25 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతన్నలు చెబుతున్నారు. రాష్ట్రంలో గోదావరి చుట్టుపక్కల ప్రాంతంలో సారవంతమైన  భూములున్నాయి. అనుకూలమైన వాతావరణం కావడంతో ఇక్కడి రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పండిన మిర్చి పంటకు విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండడంతో ఇక్కడి రైతులు డ్రిప్, మార్చింగ్ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేసి  అత్యాధునిక పద్ధతిలో మిర్చి పంటను పండిస్తుంటారు. 

రెండు మండలాల్లో 15 ఇసుక క్వారీలు

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో 15 ఇసుక క్వారీలను ప్రభుత్వం కేటాయించింది. వాజేడు మండలంలో చింతూరు, కొరకల్, బొమ్మనపల్లి, ఏడుచర్లపల్లి, వెంకటాపురం మండలంలో దానవాయిపేట, వీరభద్రవరం, రామచంద్రాపురం, ఇప్పలగూడెం, ఎదిర, యాకన్న గూడెంలో ఈసీ పర్మిషన్లు అయిపోతుండడంతో రూల్స్​కు విరుద్ధంగా రాత్రిపూట మెషిన్లతో పెద్దఎత్తున గోదావరి నది నుంచి ఇసుక ఒడ్డుకు చేర్చారు. దీంతో నదీ గర్భంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆయా ర్యాంపులలో ఒడ్డుకు వేసిన ఇసుక నదీ ప్రవాహానికి సాగు భూముల్లో పరుచుకుంది. 19 గ్రామాల్లోని సుమారు 5 వేల ఎకరాల భూమిలో ఇసుక మేటలు వేసింది. వాజేడు మండలంలో చంద్రుపట్ల, చింతూరు, వాజేడు, పుసూరు, బొమ్మనపెళ్లి, ఏడుచర్లపల్లి, వెంకటాపురం మండలంలో దానవాయిపేట, బెస్తగూడెం, వాడగూడెం, వెంకటాపురం, చొక్కాల, గొల్లగూడెం, పాత్రపురం వీరభద్రవరం, అంకన్న గూడెం, రామచంద్రాపురం మోర్రవానిగూడెం, ఆలుబాక, బొదాపురం గ్రామాల్లోని రెవెన్యూ, లంక భూముల్లో ఇసుక మేటలు వేశాయి. సాగు భూములు సుమారు నాలుగు, ఐదు అడుగుల మేర ఇసుకతో నిండిపోయాయి. రైతులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూముల హద్దులు ఎక్కడ ఉన్నాయో గుర్తు తెలియని పరిస్థితి ఏర్పడింది.  డీజిల్ ఇంజన్స్, వ్యవసాయ పనిముట్లు ఇసుకలో మునిగిపోయాయి. 

గతంలో వరదలు  వచ్చినా..

గోదావరి నదికి ప్రతి ఏడాది వరదలు వస్తుంటాయి. భూములను నీరు ముంచుతోంది. ప్రతి ఏడాది గోదావరికి వరదలు వచ్చిన అనంతరం వ్యవసాయ పనులు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది సాగు భూముల్లో ఇసుక పేరుకుపోవడంపై  రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు తరాలుగా లంక భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని, 1986 వరదలు వచ్చినపుడు కూడా ఇంత నష్టం జరగలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా నదీ గర్భం నుంచి  ర్యాంపుల పేరుతో ఇసుక తరలించుకుపోవడం వల్లే ఇసుక మేటలు వేశాయని అంటున్నారు. 

సర్కారు ఆదుకోవాలె

దానవాయిపేట గ్రామం లోని ర్యాంపు కారణం గానే మా రెండెకరాల పొలంలో ఇసుక మేట లు వేసింది. మా నాన్న ఇటీవలే చనిపోయాడు. అక్కకు మ్యారే జ్ అయింది. అమ్మ, నేను వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. పొలంలో ఇసు క మేటలు వేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ భూమే మాకు ఆధారం. ప్రభుత్వం ఆదుకోవాలి. 

- గజ్జల తిరుపతమ్మ, బెస్త గూడెం, వెంకటాపురం మండలం

ర్యాంపుల వల్లే ఇసుక మేటలు

80 ఏండ్లుగా ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటు న్నాం. గోదావరికి వరదలు వచ్చి ఊరు మునిగినా  భూముల్లో మాత్రం ఇసుక మేటలు వేయలే. ఇసుక ర్యాంపు వల్లే ఇప్పుడు ఇలా జరిగింది. ర్యాంపు యజమాని తాడి చెట్టు అంత ఎత్తులో ఇసుక గుట్టలు పెట్టాడు. వరదలకు ఆ ఇసుక పొలాలపై మేటలు వేసింది. గ్రామంలో 87 మంది రైతుల 200 ఎకరాల్లో ఇదే పరిస్థితి. సీఎం సార్​గాలి మోటార్ పై వచ్చి మా ముంచిన పొలాలు చూసిండ్రట. మాకు న్యాయం చేయండి. 

‒ జిమిడి దేవమ్మ, బెస్తగూడెం, వెంకటాపురం మండలం 

నిపుణులతో సర్వే చేయించాలి

గోదావరి వరదలతో సాగు భూముల్లో భారీ స్థాయిలో ఇసుక మేటలు వేసింది. తీర ప్రాంతం నదిలో కొట్టుకుపోయింది. ఈ విధంగా మునుపెన్నడూ జరగలేదు. ఇష్టానుసారంగా ఇసుక తరలించడం వల్ల నదీ ప్రవాహంలో భారీ మార్పులు వచ్చాయి. దీనిపై నిపుణులతో శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలి. ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు రూ. 50 వేల పరిహారం చెల్లించాలి. ప్రభుత్వమే ఇసక మేటలను తొలగించాలి. నదిలో కొట్టుకుపోయిన భూములకు ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలి.

‒ గులకోట త్రినాథ్​రావు, రాష్ట్ర కిసాన్ మోర్చా లీడర్, ములుగు