మోదీని కలిసిన సీజేపీ చీఫ్ దీప్కే?..సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలుఖండించిన అభిజీత్ దీప్కే 

మోదీని కలిసిన సీజేపీ చీఫ్ దీప్కే?..సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలుఖండించిన అభిజీత్ దీప్కే 

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే మధ్య అమెరికాలో రహస్య సమావేశం జరిగిందని శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. రౌత్ సోషల్ మీడియాలో మోదీ, అభిజీత్ దీప్కేతో చేతులు కలుపుతున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ “అమెరికాలో ఎవరిని కలిశారు?” అని ప్రశ్నించారు. ఆయన ప్రధానిని కలిసిన తర్వాతే భారత్‌‌‌‌కు వచ్చారని ఆరోపించారు.

ఈ పోస్టు వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు రౌత్‌‌‌‌ చెప్పారు. సీజేపీ ఉద్యమానికి తాము మొదట మద్దతు ఇచ్చామని, కానీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సమాచారం నేపథ్యంలో ఆ పార్టీ కదలికలపై నిఘా ఉంచినట్లు స్పష్టంచేశారు.

దీనిపై స్పందించిన అభిజీత్ దీప్కే తాను మోదీని ఎప్పుడూ కలవలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఏఐతో సృష్టించి ఉండవచ్చని తెలిపారు. దీప్కే వివరణ అనంతరం సంజయ్ రౌత్‌‌‌‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సరైన నిర్ధారణ లేకుండా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకున్నారని పలువురు మండిపడ్డారు.