Sanju Samson: ఈ విధ్వంసానికి గిల్ కూడా తప్పుకోవాల్సిందే.. ఓపెనర్‪గా 42 బంతుల్లో శాంసన్ సెంచరీ

Sanju Samson: ఈ విధ్వంసానికి గిల్ కూడా తప్పుకోవాల్సిందే.. ఓపెనర్‪గా 42 బంతుల్లో శాంసన్ సెంచరీ

ఆసియా కప్ లో టీమిండియా ఓపెనర్ల విషయంలో గందరగోళం మొదలయింది. అభిషేక్ శర్మకు జోడీగా గిల్, శాంసన్ రేస్ లో ఉన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఏ కాంటినెంటల్ టోర్నీ యూఏఈ వేదికగా జరగబోతుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైందనే టాక్ నడుస్తోంది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. అభిషేక్ తో ఎవరు ఓపెనర్ గా బరిలోకి దిగుతారో చర్చ జరుగుతుంది.

గిల్ లేనప్పుడు అభిషేక్, శాంసన్ ఓపెనర్లుగా ఆడి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గిల్ రావడంతో కొత్త తలనొప్పి మొదలయింది. ఇదిలా ఉంటే తాను ఓపెనర్ రేస్ లో ఉన్నానని శాంసన్ మరోసారి నిరూపించాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025లో కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్న శాంసన్.. ఆదివారం (ఆగస్టు 24) ఏరీస్ కొల్లం సెయిలర్స్‌పై విధ్వంసమే సృష్టించాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేసి గిల్ కు గట్టి పోటీదారుడిగా నిలిచాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఆ తర్వాత 50 పరుగులను చేరుకోవడానికి 26 బంతులు అవసరమయ్యాయి. ఓవరాల్ గా 51 బంతుల్లో 121 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఔటయ్యాడు. 

శాంసన్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ కేరళ స్టార్ విధ్వంసంతో తమ జట్టు 20 ఓవర్లలో ఏకంగా 237 పరుగులు చేసింది. ఓపెనర్ గా అదరగొట్టిన సంజు.. మిడిల్ ఆర్డర్ లో తేలిపోయాడు. శనివారం (ఆగస్టు 23) అలెప్పీ రిప్పల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్టార్ బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 22 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం విశేషం. శాంసన్ సెంచరీతో నెటిజన్స్ అతనికి ఆసియా కప్ లో ఓపెనర్ గా పంపాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.