హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్

హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్
  • హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్
  • ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్​ రెడ్డి అపాయింట్
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ రామకృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సర్ఫారాజ్​అహ్మద్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ పోస్టులో ఉన్న ఎన్వీఎస్​రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు పలువురు ఐఏఎస్​లు, నాన్​ క్యాడర్​బదిలీలు, పోస్టింగ్​లపై సీఎస్​రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఎన్వీఎస్​రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి రిలీవ్​ చేసి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకున్న అనుభవాన్ని పట్టణ రవాణా రంగంలో వినియోగించుకోవడానికిగాను అర్బన్​ట్రాన్స్​పోర్ట్​ సలహాదారుడిగా నియమించారు. ఇక ఆయన స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్‌‌గా ఉన్న సర్ఫారాజ్​అహ్మద్​ను  రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే.. స్టడీ లీవ్ నుంచి తిరిగి వచ్చిన  శ్రుతి ఓజాను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. 

ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి. శ్రీజన రిలీవ్​అయ్యారు.  ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌గా ఉన్న కృష్ణ ఆదిత్యకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కె. సీతాలక్ష్మిని ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. హెచ్‌‌ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌‌గా ఉన్న శ్రీవత్సను జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్)గా నియమించారు. అలాగే, బదిలీ అయిన ఆర్. ఉపేందర్ రెడ్డి స్థానంలో హెచ్ఎండీఏ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను  అప్పగించారు. కోఆపరేటివ్ డిపార్ట్‌‌మెంట్‌‌లో జాయింట్ రిజిస్ట్రార్‌‌గా పనిచేస్తున్న రాజిరెడ్డిని హైదరాబాద్‌‌లోని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌‌గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న జితేందర్ రెడ్డిని  ఆయిల్‌‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌‌గా బదిలీ చేశారు. కరీంనగర్‌‌లో  పీడీ, హౌసింగ్‌‌గా ఉన్న రాజేశ్వర్ ను  ఆదిలాబాద్‌‌లో అదనపు కలెక్టర్ (ఎల్​బీ)గా అపాయింట్ చేశారు.