హైదరాబాద్ సరూర్ నగర్ లో అప్సర హత్య కేసు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. అప్సర కు ఇంతకుముందే పెళ్లి జరిగిన ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతను ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది. తన భర్తతో విభేదాల తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళి పూజారితో ప్రేమలో పడి హత్యకు గురైంది.
నిందితుడు సాయి కృష్ణ.. జూన్ 3న అప్సరను శంషాబాద్‌లో హత్య చేసి.. కారులో డెడ్ బాడీనీ సరూర్ నగర్ డంప్ చేశాడు. అక్కడ ఓ మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఈ విషయం బయటపడకుండా మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు. నిందితుడు సాయి కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు.. అప్సర భౌతికదేహాన్ని మ్యాన్ హోల్ నుంచి బయటకు తీశారు. అప్సరను హత్య చేసేందుకు సాయికృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అప్సరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి దించి..ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో వెల్లడైంది.
దారుణహత్యకు గురైన అప్సర హత్యకేసులో నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణణు రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా..కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయి కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు సాయికృష్ణ రిమాండ్ లోనే ఉండనున్నాడు. ఈ కేసులో పూజారి వెంకట సాయి కృష్ణపై 302, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్సర గర్భవతి అని నిందితుడు వెల్లడించడంతో...శవపరీక్ష నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అదే నిజమైతే సాయికృష్ణపై మరిన్ని సెక్షన్లు విధించే అవకాశం ఉంది.

