యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి.. శాతవాహనలో పీఈ సెట్ ఫిజికల్, స్కిల్ టెస్టులు ప్రారంభం

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి.. శాతవాహనలో పీఈ సెట్  ఫిజికల్, స్కిల్  టెస్టులు ప్రారంభం
  •    ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్  బాలకృష్ణారెడ్డి 
  •     శాతవాహనలో పీఈ సెట్  ఫిజికల్, స్కిల్  టెస్టులు ప్రారంభం

కరీంనగర్, వెలుగు: యువత క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్  బాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు అందించే రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ ఫిజికల్  ఎడ్యుకేషన్  కంబైన్డ్  ఎంట్రెన్స్  టెస్ట్(టీజీ పీఈసీఈటీ)ను శాతవాహన యూనివర్సిటీలో ఆదివారం ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఫిజికల్  ఫిట్ నెస్, నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలతోనూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కోచ్ గా, పీఈటీగా,  ఆటగాడిగా వివిధ క్రీడా సంబంధమైన ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని తెలిపారు. వీసీ ఉమేశ్ కుమార్  మాట్లాడుతూ ఫిజికల్  ఫిట్ నెస్  టెస్టులు,  స్కిల్  డెవలప్ మెంట్  టెస్టుల్లో ప్రతిభ చాటుతూ పీఈసెట్ కు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.

 ఏడాదిలోగా క్రీడా మైదానంలో సింథటిక్  ట్రాక్  ఏర్పాటు చేస్తామని,  స్పోర్ట్స్  గ్యాలరీని పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్​ లక్ష్మీకాంత రాథోడ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్​ శ్రీరామ్ వెంకటేశ్, పీఈసెట్  కన్వీనర్  ప్రొఫెసర్​ రాజేశ్ కుమార్, రిజిస్ట్రార్  ప్రొఫెసర్  సతీశ్ కుమార్  మాట్లాడారు. 

మొదటి రోజు బీపీఈడీ కోర్సుకు 713 మంది దరఖాస్తు చేసుకోగా, 531 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. డీపీఈడీకి 285 మంది దరఖాస్తు చేసుకోగా, 190 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారికి 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్,  హై జంప్, బాస్కెట్  బాల్, క్రికెట్, బాల్  బ్యాడ్మింటన్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.