డ్రగ్స్, ఆల్కహాల్ కలయికే ప్రాణాలు తీసింది.. వీడిన సౌదీ యువరాజు డెత్ మిస్టరీ

డ్రగ్స్, ఆల్కహాల్ కలయికే ప్రాణాలు తీసింది.. వీడిన సౌదీ యువరాజు డెత్ మిస్టరీ

సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన 29 ఏళ్ల యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ లండన్‌లో మృతి చెందారు. మద్యం, పార్టీ డ్రగ్స్, వైద్యులు సూచించిన కొన్ని మందులను ఒకేసారి తీసుకోవడం వల్ల గుండెపోటు రావడంతో మరణించినట్లు యూకే కోర్టు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 25న లండన్‌లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని ఓ లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకుంది.

హోటల్ గదిలో అపస్మారక స్థితిలో..
యువరాజు నవంబర్ 19న లండన్‌లోని మారియట్ హోటల్‌లో వారం రోజుల బస కోసం చెక్-ఇన్ చేశారు. మరణానికి ముందు రోజు రాత్రి సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. మరుసటి రోజు హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి వెళ్లగా, బాత్రూమ్ నేలపై పూర్తిగా దుస్తులు ధరించిన స్థితిలో ఆయన అపస్మారకంగా పడి ఉన్నారు. వెంటనే అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చినా, వైద్య సిబ్బంది ఆయనను కాపాడలేకపోయారు. 

టాక్సికాలజీ నివేదికలో కీలక విషయాలు..
విచారణలో సమర్పించిన టాక్సికాలజీ నివేదిక ప్రకారం యువరాజు రక్తంలో మద్యం శాతం ఇంగ్లాండ్‌లో అనుమతించిన డ్రైవింగ్ పరిమితికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పార్టీ డ్రగ్‌గా పిలిచే గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్, గంజాయి ఆనవాళ్లు, అలాగే బీపీ తగ్గించే కొన్ని మందులు కూడా గుర్తించారు. ఈ పదార్థాలన్నీ కలిసి గుండెపోటుకు కారణమై మరణం సంభవించినట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు.

గతంలో చికిత్స కూడా తీసుకున్న యువరాజు..
యువరాజు గతంలో మద్యం, కొన్ని మందులపై ఆధారపడే అలవాటు నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకున్నట్లు కోర్టులో వెల్లడైంది. 2025 ఆగస్టులో లండన్‌లోని ఒక ప్రైవేట్ డీ-అడిక్షన్ కేంద్రంలో చేరి డీటాక్స్ చికిత్స పూర్తి చేశారు. అనంతరం మరో వైద్య కేంద్రంలో కూడా చికిత్స పొందారు. వైద్యుల సూచనలు పాటించినప్పటికీ.. తర్వాత ఫాలోఅప్ అపాయింట్‌మెంట్‌లకు హాజరు కాలేదని విచారణలో వెల్లడైంది.

ALSO READ : ఎర్రసముద్రంలో బాంబుల మోత.. ఆయిల్ ట్యాంకర్లపై హౌతీల అటాక్.. 

ఆత్మహత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణం
కేసును విచారించిన అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్, ఇది ఆత్మహత్య కాదని స్పష్టం చేశారు. యువరాజు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఇతరుల ప్రమేయం కూడా కనిపించలేదని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల్లో చివరి వరకు ఆయన ఒంటరిగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతో మద్యం, మత్తు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల జరిగిన ప్రమాదవశాత్తు మరణంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం సౌదీ రాజ కుటుంబం అధికారికంగా ఆయన మరణాన్ని ధ్రువీకరిస్తూ రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకటించింది.