అసెంబ్లీలో సావర్కర్​ ఫొటో.. అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు

అసెంబ్లీలో సావర్కర్​ ఫొటో.. అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు
  • కర్నాటక–మహారాష్ట్రల సరిహద్దు వివాదం
  • సరిహద్దులకు భారీగా చేరుకున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ కార్యకర్తలు
  • 300 మందిని అరెస్టు చేసిన కర్నాటక పోలీసులు

బెళగావి: కర్నాటక–మహారాష్ట్ర సరిహద్దు వివాదం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. సోమవారం బెళగావిలో కర్నాటక సర్కారు శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారుకు నిరసన తెలిపేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్  కార్యకర్తలు బెళగావి సరిహద్దు వద్దకు వెళ్లగా 300 మందిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమందిని ముందస్తుగా అరెస్టు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని మధ్యవర్తి మహారాష్ట్ర ఏకీకరణ్  సమితి(ఎంఎంఈఎస్) గత ఐదు దశాబ్దాలుగా డిమాండ్  చేస్తోంది. కర్నాటక శీతాకాల అసెంబ్లీ సెషన్  నేపథ్యంలో బెళగావిలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎంఎంఈఎస్  కార్యకర్తలు కూడా ప్లాన్  చేశారు. ఆ సంస్థ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కాంగ్రెస్  ప్రెసిడెంట్  నానా పటోలే మాట్లాడుతూ సరిహద్దు సమస్య పరిష్కారం కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విభజించి పాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే బార్డర్  సమస్య ఇంకా కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య సమావేశాలు జరిగినా నేతలను అక్కడికి అనుమతించడం లేదు. దీని వెనుక కేంద్ర ఉన్నట్లు కనిపిస్తోంది” అని పటోలే అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత

మెట్లపై నేతల ధర్నా

కర్నాటక బీజేపీ ప్రభుత్వం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్  సావర్కర్  చిత్రపటాన్ని బెళగావిలోని అసెంబ్లీలో ఉంచింది. దీంతో ఈ పరిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. సోమవారం బెళగావిలోని రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ అసెంబ్లీలోకి ప్రవేశించాక సావర్కర్  చిత్రపటం కనబడడంతో ప్రతిపక్ష కాంగ్రెస్  నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేత సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ లీడర్లు నెహ్రూ ఫొటోలతో అసెంబ్లీ మెట్లపై నిరసన తెలిపారు. ‘మేము అసెంబ్లీ సమావేశాలను డిస్టర్బ్  చేసి నిరసన తెలపాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఈ సెషన్​లో మేము సర్కారు అవినీతి గురించి మాట్లాడతామని తెలిసే బొమ్మై ప్రభుత్వం ఇలా చేసింది’ అని కాంగ్రెస్  నేత డీకే శివకుమార్  అన్నారు.