V6 News

బ్యాంకులో మోసానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

బ్యాంకులో మోసానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్
  •     రూ.2.42 కోట్లు స్వాధీనం 
  •     6 సెల్ ఫోన్లు, లాప్​టాప్​ సీజ్ 

దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్​లో రూ.2.65 కోట్లు స్వాహా చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ ఎస్పీ ఆఫీస్​లో మంగళవారం ఎస్పీ శరత్​ చంద్ర పవార్  మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల13న బ్యాంకులో రూ.2,65,55,268 కాంట్రాక్టు ఉద్యోగి లెండిలే చక్రపాణి మోసపూరితంగా బదిలీ చేశాడని దేవరకొండ బ్రాంచ్ మేనేజర్  ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బ్యాంక్​ అటెండర్  లెండేల చక్రపాణి తనకు పరిచయం ఉన్న సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్  మేనేజర్  పుట్టా వెంకట రామాంజనేయులుతో కలిసి ఇనాక్టివేట్ గా ఉన్న అకౌంట్లలోని డబ్బులను కాజేయాలను కుట్ర పన్నారు. 

ఖాతాల వివరాలు, ఖాతాదారుల ఐడెంటీ ప్రూఫ్ లు సేకరించి, బ్యాంకు ఉద్యోగుల లాగిన్  వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్ లో లాగిన్  అయ్యి ఖాతాదారుల నగదును నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కేతావత్ రాంలాల్, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన మారేపల్లి శివ ఖాతాలకు ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఈ డబ్బులో 45 శాతం చొప్పున లెండిలే చక్రపాణి, మేనేజర్ రామాంజనేయులు,10 శాతం చతావత్  రాంలాల్, మారేపల్లి శివ పంచుకున్నారు. డీఎస్పీ, సీఐ వెంకట్​రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు.