
బషీర్బాగ్, వెలుగు: ఇంట్లో కూర్చోని లక్షలు సంపాదించుకోవచ్చన్న ఆశకు పోయి ఓ యువకుడు నిండా మునిగాడు. స్కామర్స్ వలకు చిక్కి రూ.10 లక్షలకు పైగా డబ్బు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన 26 ఏళ్ల యువకుడికి పార్ట్ టైం జాబ్ అంటూ స్కామర్స్ వాట్సప్ మెసేజ్ పంపారు. రోజుకు రెండు మూడు గంటలు పనిచేస్తే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చని ఆఫర్ చేశారు.
కె.రహేజా కార్పొరేషన్పేరుతో లింక్ పంపి అందులో పెట్టుబడి పెడితే రెండు మూడింతలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. పలుమార్లు కొంత ఇన్వెస్ట్ చేయించి.. డబ్బులు రెట్టింపు అయినట్లుగా చూపించారు. విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో వారిపై నమ్మకం కలిగిన బాధిత యువకుడు పలు దఫాలుగా పెద్దమొత్తంలో యాప్లో పెట్టుబడి పెట్టాడు. కానీ ఆ డబ్బులు తిరిగి రాలేదు. ఇలా మొత్తం స్కామర్స్ రూ.10.19 లక్షలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు.