మరో 4 జిల్లాల్లో టీచర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్

మరో 4 జిల్లాల్లో టీచర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్
  • నెలాఖరు నుంచి అమల్లోకి 
  • ఇప్పటికే 14 జిల్లాల్లో కొనసాగుతున్న బయోమెట్రిక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో 4 జిల్లాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్, కరీంనగర్​, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్​ సిస్టమ్ అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాల మేరకు అధికారులు ఈ నెలాఖరు నుంచే అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్​కర్నూల్, గద్వాల, వికారాబాద్, పెద్దపల్లి, జగిత్యాల తదితర జిల్లాల్లో ఈ విధానం అమలు జరుగుతోంది. కరోనాకు ముందు ఈ జిల్లాల్లో టీచర్లతో పాటు స్టూడెంట్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండేది.

ప్రస్తుతం టీచర్లకే పరిమితం చేయడంతో మిగిలిన బయోమెట్రిక్ అటెండెన్స్ మిషన్లతో ఇంకో 4 జిల్లాల్లోని టీచర్లకు అమలు చేయనున్నారు. నిజామాబాద్​కు 1144 డివైజ్​లు, కరీంనగర్​కు 623, రాజన్న సిరిసిల్లకు 472, జనగామకు 676 డివైజ్​లను పంపించనున్నట్టు శ్రీదేవసేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల పాయింట్ల నుంచి వీటిని కలెక్ట్​ చేసుకోవాలని హెడ్మాస్టర్లకు సూచించారు. ఆయా జిల్లాల్లోని గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు.