బడికెట్ల పోవాలె? : నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

బడికెట్ల  పోవాలె? : నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

ఊర్ల నుంచి
బస్సులు తిరగట్లే..
 నడిచే వాటిల్లో
పాసులు చెల్లట్లే!

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత స్టూడెంట్లంతా ఒక్కసారిగా బయటికిరానున్నారు. సెప్టెంబర్​ 28 నుంచి ఈ నెల13వ తేదీ వరకు దసరా సెలవులు ముగిసి, 14న క్లాసులు మొదలుకావాల్సి ఉంది. కానీ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం 19వ తేదీ వరకు సెలవులను పొడిగించింది.

20న ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన 5వ తేదీ నుంచి ఇప్పటిదాకా సెలవులే ఉంటడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు స్కూళ్లు, జూనియర్‌‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌‌, ఇతర ప్రొఫెషనల్‌‌ కాలేజీల విద్యార్థులంతా రోడ్డెక్కనుండటంతో అసలు సమస్య మొదలవుతోంది.

20 లక్షల మందికి ఇబ్బందే..

రాష్ట్రంలో సుమారు 60 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌‌ విద్యాసంస్థలు ఉండగా వాటిలో 80 లక్షల మంది వరకు స్టూడెంట్లు చదువుతున్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రత్యేకంగా బస్సులు ఉండగా.. చాలా వరకు ప్రైవేటు విద్యా సంస్థలు, సర్కారు బడులు, కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎలా వెళతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో 14.70 లక్షల స్టూడెంట్‌‌ బస్ పాసులు ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్​ కోర్సుల కాలేజీలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. బస్‌‌ పాస్‌‌లు తీసుకోని స్టూడెంట్లూ వేలల్లోనే ఉంటారు. ఇక ఆయా విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది వేలాది మంది బస్సులపైనే ఆధారపడి ఉంటారు. మొత్తంగా సుమారు 20 లక్షల మంది వరకు ఇబ్బంది తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

రూరల్​ స్టూడెంట్లకు కష్టమే..

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 6,437 బస్సులు (71 శాతం) నడిచాయని అధికారులు ప్రకటించారు. సాధారణ రోజుల్లో10 వేలకుపైగా బస్సులు నడుస్తాయి. స్టూడెంట్ల కోసమే చాలా గ్రామాలకు ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు సమ్మెతో చాలా వరకు బస్సులు ఆగిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నడుస్తున్న బస్సులన్నీ దాదాపు పట్టణ ప్రాంతాల మధ్యే తిరుగుతున్నాయి. సోమవారం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో స్టూడెంట్లు స్కూళ్లు, కాలేజీలకు ఎలా వెళ్లగలరని ప్రశ్నలు వస్తున్నాయి.

సిటీలో ఎట్లా?

హైదరాబాద్​లో ఉదయం, సాయంత్రం బస్సు ట్రిప్పులు పెద్ద సంఖ్యలో స్టూడెంట్లతో రష్‌‌గా ఉంటాయి. డోర్ల వద్ద, ఫుట్​బోర్డుపై వేలాడుతూ వెళ్లే పరిస్థితి. అలాంటిది అనుభవం లేని టెంపరరీ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తే ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు టెంపరరీ సిబ్బంది బస్‌‌ పాసులు చెల్లవంటూ ప్రయాణికులను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఇప్పుడు స్టూడెంట్ల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు.