రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్.. 

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్.. 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్రను బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • బంద్‌‌‌‌‌‌‌‌ పాటిస్తూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఏ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విద్యార్థి సంఘాలు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముట్టడి సమయంలో స్టూడెంట్లపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్​, పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, ఏఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో సంఘాలు శుక్రవారం బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలని పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నారాయణగూడ నుంచి వైజంక్షన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత సంఘాల నేతలు నాగరాజు(ఎస్ఎఫ్​ఐ), మణికంఠరెడ్డి(ఏఐఎస్ఎఫ్​), అనిల్, మహేశ్(పీడీఎస్​యూ) మాట్లాడారు. విద్యార్థులపై దాడి అమానుషమన్నారు. నీట్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణలో విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. 

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఆయనను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోయిన ఎన్టీఏను రద్దు చేసి, పారదర్శకమైన వ్యవస్థను తేవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. 

కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర  కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్​ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, రమ్య, పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ రాష్ట్ర నాయకులు నాగరాజు, ఏఐఎఫ్ డీఎస్ నేతలు మురళి, నాగార్జున, డీవైఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆనగంటి వెంకటేశ్, జావిద్, ఏఐవైఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వలిఉల్లాఖాద్రి, పీవైఎల్ నేత రామకృష్ణ, ఏఐవైడీవై నేత వనం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.