బడి బస్సు భద్రమేనా..? 

బడి బస్సు భద్రమేనా..? 
  • రెండేళ్లుగా ఫిట్ నెస్ పరీక్షలు లేవు
  • ఉమ్మడి జిల్లాలో 1,701 బస్సులు
  • ఫిట్ నెస్ లేనివి సుమారు 70 శాతం
  • రేపు స్కూళ్లు స్టార్ట్  

కరీంనగర్/తిమ్మాపూర్,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు షురూ కాబోతున్నాయి.ఈ నేపథ్యంలో పిల్లల పిల్లల పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులపైనే కాకుండా.. వారు ప్రయాణించే బస్సులపై కూడా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని అంటున్నారు అధికారులు. బస్సులు కండీషన్​లో లేక గతంలో ప్రమాదాలు జరిగాయని, బడులు ప్రారంభానికి ఇంకా ఒక రోజే ఉన్నా.. ఫిట్​నెస్ పరీక్షలకు స్కూల్ యాజమాన్యాలు బస్సులను తీసుకురావడంలేదని అధికారులు చెబుతున్నారు.   

70 శాతం బస్సులు టెస్టులకు రాలే..  

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,701 బస్సులున్నాయి. ఇందులో కేవలం 577  బస్సులకు మాత్రమే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 1,124 బస్సులకు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ చేయించాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం స్కూల్​ బస్సులు 846 ఉండగా 368 బస్సులకు మాత్రమే ఫిట్​నెస్​ టెస్టులు చేశారు. 15 ఏండ్లు దాటినవి 370 బస్సులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 266  బస్సులుంటే .. 21 వాహనాలను మాత్రమే టెస్టు చేయించారు. 15 ఏండ్లు దాటినవి 88 బస్సులున్నాయి. జగిత్యాల జిల్లాలో 444 బస్ లుంటే 149 బస్ లకు ఫిట్​నెస్​ టెస్ట్​ చేయించారు. 15 ఏండ్లు దాటినవి 177 బస్సులున్నాయి. సిరిసిల్ల జిల్లాలో 145 బస్ లకు 39 బస్ లు మాత్రమే చేయించారు. 15 ఏండ్లు పూర్తయి కాలం చెల్లినవి 25 బస్సులు ఉన్నాయి. వీటిని నడపాలంటే స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు మరో ఐదేండ్ల పాటు ఎక్స్ టెన్షన్ తీసుకోవాలి.  

ఫిట్​నెస్​ టెస్ట్​ చేయించుకోకపోతే..?  
ఇంకొక్క రోజులో స్కూళ్లు ప్రారంభంకాబోతుండగా ఇంకా పరీక్షలు చేయించుకోనివి 1,124 బస్సులు, 15 ఏండ్ల కాలం చెల్లినవి 660 బస్సులు ఉన్నాయి. వీటికి ఒక్క రోజులో  ఫిట్​నెస్ ​టెస్టులు చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. అలాగే గడువు పూర్తయ్యేదాకా ఫిట్​నెస్ ​టెస్టు చేయించుకోకపోతే.. గడువు దాటిన రోజు నుంచి పర్​డే రూ.50 చొప్పున అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వాహనాల ఫిట్​నెస్​డేట్​మే 15 వరకు  ఉంది. ఇప్పటి వరకు చేయించుకోని వారంతా అప్పటి నుంచి బస్ లకు  పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.  

ఈ నిబంధనలు పాటించాల్సిందే..  
మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్రేషన్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌, పర్మిట్‌‌‌‌, పన్ను చెల్లింపు రసీదు, పొల్యూషన్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌తోపాటు డ్రైవర్లకు లైసెన్స్‌‌‌‌ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్‌‌‌‌ ఫొటోను తప్పనిసరిగా బస్సులో ఏర్పాటు చేయాలి. అద్దాలకు గ్రిల్ అమర్చాలి. డ్రైవర్‌‌‌‌కు 60 ఏండ్లు మించకూడదు. ప్రతి బస్సులో విద్యార్థులకు అటెండెంట్ ఉండాలి. ప్రతి నెల స్కూల్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌, పేరేంట్స్‌‌‌‌ కమిటీ తప్పనిసరిగా బస్సులను తనిఖీ చేయాలి. డ్రైవర్‌‌‌‌ వద్ద ఫిర్యాదు పుస్తకం ఉండేలా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. పరిమితికి మించి విద్యార్థులను 
ఎక్కించరాదు. బస్సులకు తప్పక పసుపు రంగు వేయాలి. 

ఫిట్ నెస్ చేయించుకోకుంటే సీజ్
ఉమ్మడి జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులు ఫిట్​నెస్​తప్పనిసరిగా చేయించుకోవాలి. ఫిట్​నెస్ లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తాం. స్కూళ్ల ఓపెనింగ్ నాటికి యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్​నెస్ పరీక్షలు చేయించుకోవాలి.  - మామిండ్ల  చంద్రశేఖర్ గౌడ్,  డీటీసీ, కరీంనగర్.