సైన్స్‌-‘సోషల్‌’ చెట్టపట్టాల్‌

సైన్స్‌-‘సోషల్‌’ చెట్టపట్టాల్‌

ఒకప్పుడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి తెలిసేందుకు కొన్ని జర్నల్స్​లో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వెబినార్ల ద్వారా పరిశోధనలపై సెమినార్లు ఇచ్చే అవకాశం దొరికింది. ఈమెయిల్స్​లో ఆ పేపర్​ను పంపే వెసులుబాటు వచ్చింది. అదింకా అభివృద్ధి చెంది ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, లింక్​డ్​ఇన్​, వాట్సాప్​ వంటి సోషల్​ మీడియా సైట్ల ద్వారా జనానికీ చేరువయ్యే వేదిక దొరికింది. చాలా మంది సైంటిస్టులు వాళ్లు చేసిన పరిశోధనలను సోషల్​ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్తున్నారు. అలాంటి సైంటిస్టులకు ప్రోత్సాహం అందించే దిశగా రీసెర్చ్​గేట్​, అకాడమియా.ఈడీయూ (academia.edu) వంటి సంస్థలు లింక్​డ్​ ఇన్​ వంటి సోషల్​ మీడియా సైట్లతో జట్టు కడుతున్నాయి. ఆసప్​సైన్స్​ వంటి కొన్ని ప్రముఖ బ్లాగులు, వ్లాగులు జనానికి ఆ పరిశోధనలను చేరువ చేస్తున్నాయి. హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​, విస్​ ఇనిస్టిట్యూట్​ వంటి అంతర్జాతీయ సంస్థలు, కొన్ని పరిశోధనా సంస్థలు సొంతంగా సోషల్​మీడియా పేజీలనే నడుపుతున్నాయి. మైక్రోస్కోపులో మాత్రమే కనిపించే అందమైన సూక్ష్మజీవులు, ఇతర బ్యాక్టీరియా బయోఫిల్స్మ్​ను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేస్తున్నారు. దాని వల్ల అవి జనానికి దగ్గరవుతున్నాయి.

ఇండియాలో పెరుగుతోంది

కొన్నేళ్లుగా మన దేశంలోనూ సైన్స్​పై సోషల్​మీడియా మంచి ఫలితాన్నే చూపిస్తోంది. సోషల్​ మీడియా వల్ల తమ పరిశోధనలకు భాగస్వాములు దొరుకుతున్నారని, ఆర్థికంగా చేయూత లభిస్తోందని చాలా మంది సైంటిస్టులు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని కంపెనీలు తమ పరిశోధనల తాలూకు పేపర్లను చూసి మంచి అవకాశాలు కూడా ఇస్తున్నాయంటున్నవాళ్లూ ఉన్నారు. సోషల్​ మీడియానే ఆయా పరిశోధనలకు చర్చావేదికగా నిలుస్తోంది. ఉదాహరణకు ట్విట్టర్​నే తీసుకుందాం. ఒక్క హాష్​ట్యాగ్​ అందరికీ చేరి ఎంతలా సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఆందోళనల దగ్గర్నుంచి మంచి పనుల వరకు ఆ హాష్​ట్యాగ్​ వెంటనే జనానికి చేరువవుతుంది. ఆ కోవలోనే రీసెర్చ్​ ఫెలోషిప్​ పెంచాలంటూ #hikeresearchfellowship హాష్​ట్యాగ్​తో చేసిన ట్విట్టర్​ ఉద్యమం రీసెర్చ్​ ఫెలోస్​కు మంచి చేసింది.

జనం–సైన్స్​కు వారధి

సైన్స్​పై జనాల్లో అవగాహన కల్పించేందుకు వాట్సాప్​ వంటి సైట్లు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల సెంటర్​ ఫర్​ సెల్యూలార్​ అండ్​ మాలిక్యులర్​ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు బ్యాక్టీరియాలోని కణ త్వచ పెరుగుదలను నియంత్రించే ఓ ఎంజైమ్​ను కనుగొన్నారు. దాని వల్ల ఓ కొత్త మందు కనుగొనేందుకు మార్గం ఏర్పడింది. దాని గురించి పత్రికల్లో వార్తలొచ్చినా సోషల్​ మీడియా ద్వారానూ ఆ పరిశోధనను జనానికి చేరువ చేశారు సైంటిస్టులు. అంటే ఒరిజినల్​ పరిశోధన జనానికి చేరుతుందన్నమాట. ఇండియా సైన్స్​పై ప్రత్యేకంగా పనిచేస్తున్న ద లైఫ్​ ఆఫ్​ సైన్స్​ (టీఎల్​ఓఎస్​) అనే సంస్థ, శాస్త్రపరిశోధనల్లో మహిళల పాత్రను జనానికి చేరువయ్యేలా చేస్తోంది.

‘సోషల్​’ సైంటిస్ట్​

అందరిలాగే ప్రముఖ సైంటిస్టులూ ట్విట్టర్​, ఫేస్​బుక్​ వంటి వాటిలో చురుగ్గా ఉంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ అడ్వైజర్​, సీఎస్​ఐఆర్​ డైరెక్టర్​ జనరల్​, బయోటెక్నాలజీ డిపార్ట్​మెంట్​ కార్యదర్శి, భారత వైద్య పరిశోధనా మండలి, బిరాక్​ వంటి సంస్థలు ట్విట్టర్​లో యాక్టివ్​గా ఉంటున్నాయి. కాబట్టి నేటి తరం సైంటిస్టులకు తమ పరిశోధనలను నేరుగా అలాంటి పెద్ద ఆఫీసర్లకు తెలియజేయడం సులువు అవుతోంది. ఆ పరిశోధనలను వాళ్లకు ట్యాగ్​ చేయడం ద్వారా ఈజీగా వారి దగ్గరకు చేరిపోతోంది. ఇంత చేస్తున్నా ఇప్పటికీ 80 శాతం పరిశోధనలు జనానికి చేరువ కావట్లేదు. ఆ గ్యాప్​ను పూడ్చాలంటే దాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలంటున్నారు. పరిశోధనలు జనానికి మరింత చేరువయ్యేలా స్థానిక భాషల్లో సైన్స్​ బ్లాగులు ప్రచురించాల్సిన అవసరం ఉందంటున్నారు.  జనానికి మరింత దగ్గర చేయాల్సి ఉందని చెబుతున్నారు.

సూడో సైన్స్​పై పోరు

ఈ మధ్య సూడోసైన్స్​ కథనాలు ఎక్కువైపోయాయి. ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్​ (టెస్ట్​ ట్యూబ్​ బేబీ)నే తీసుకుందాం. కొద్ది నెలల క్రితం నిర్వహించిన ఇండియన్​ సైన్స్​ కాంగ్రెస్​లో ఓ ప్రముఖ సైంటిస్టు, అది మహాభారతం కాలంలోనే ఉందని, కౌరవులు ఆ పద్ధతిలోనే పుట్టారన్న వ్యాఖ్యలు చేశారు. దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ అడ్వైజర్​ దానిపై పెద్ద వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కారణం, సోషల్​మీడియాలో దానిపై ఓ ఉద్యమమే నడిచింది కాబట్టి. #savescience పేరిట సూడోసైన్స్​పై పోరాటం చేశారు. అదొక్కటే కాదు, అలాంటి పోరాటాలు చాలానే జరుగుతున్నాయి.