- ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేశారని సీనియర్ల అసహనం
- గాంధీ భవన్‌లో రేణుకా చౌదరి వర్గం ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల పంపకం చిచ్చు రేపుతోంది. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేసి, కష్టకాలంలో పార్టీని కాపాడిన తమను విస్మరించారని వారు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గం నేతలు శుక్రవారం గాంధీ భవన్ మెట్లెక్కారు.
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో, సుమారు 50 మంది నేతలు గాంధీభవన్ లో వినతి పత్రం సమర్పించారు. కేవలం రేణుకా చౌదరి వర్గం అనే ముద్ర వేసి తమకు పదవులు దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో నామినేటెడ్ పోస్టుల పంచాయితీ ముదిరింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తనను మంత్రులు, ఎమ్మెల్యేలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సిఫారసు చేసినా, వైస్ ఛైర్మన్ పదవితో సరిపెట్టారని లక్ష్మీనారాయణ గౌడ్ వాపోయారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతకు చైర్మన్ పదవి కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంతో సంబంధం లేని నేతలు తన పదవికి అడ్డుపడ్డారని ఆరోపిస్తూ.. వైస్ చైర్మన్ పదవిని తిరస్కరించడమే కాకుండా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి వచ్చిన బొమ్మ శ్రీరాం చక్రవర్తికి మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంపై హుస్నాబాద్ నియోజకవర్గ సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా జెండా మోసిన తమను కాదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. మొత్తానికి, నామినేటెడ్ పదవుల ప్రకటన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ అంతర్గత విభేదాలను రచ్చకెక్కించింది.
