భవనాలు మాకేవి!.సర్కార్ తీరుపై బలహీనవర్గాల ఆగ్రహం

భవనాలు మాకేవి!.సర్కార్ తీరుపై బలహీనవర్గాల ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైటెక్‌‌ సిటీలో కమ్మ, వెలమలకు పదెకరాలు కేటాయించిన రాష్ట్ర సర్కారు.. తమకు కూడా భూమి ఇవ్వాలని బడుగు, బలహీనవర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అగ్ర కులాలకు ఇచ్చినట్లుగా స్థలాలు తమకెందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాయి. 59 కులాలు ఉన్న ఎస్సీల్లో ఒక్క వర్గానికి కూడా భూములు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు భూమి కేటాయించాలని మూడేండ్ల కిందటే దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటికీ స్పందించలేదని వాపోతున్నాయి. బీసీల్లో కొన్ని కులాలకే స్థలాలు కేటాయించి చేతులు దులుపుకున్న సర్కారు.. ఎస్టీల్లో రెండు వర్గాలకు మాత్రమే బిల్డింగ్స్‌‌ కట్టి మమ అనిపించింది. అగ్రకులాలకు మాత్రం పెద్దపీట వేసింది.

మాదిగ భవన్‌‌ హామీ ఏమైంది..?

రాష్ట్రంలో 18 శాతం ఎస్సీ జనాభా ఉంది. ఎస్సీ జాబితాలో మొత్తం 59 కులాలు, ఉపకులాలు ఉన్నాయి. ఇందులో మాదిగ, మాల మేజర్ కులా లు. కానీ ఎస్సీల్లో ఇప్పటిదాకా ఒక్క వర్గానికి కూడా బిల్డింగ్‌‌ కట్టించలేదు. కనీసం ల్యాండ్ ఇవ్వలేదు. హైదరాబాద్‌‌లో 5 ఎకరాల్లో మాదిగ భవన్‌‌ కట్టిస్తామని గతంలో సీఎం కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. ఇక ఏండ్లుగా కొనసాగుతున్న జగ్జీవన్‌‌రామ్‌‌ భవన్‌‌ నిర్మాణానికి.. కుల సంఘాలకు సంబంధం లేదు. అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఎస్సీలకు ఏదో చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, తాము ఎప్పుడూ వెనకబడి, వివక్షకు గురికావాలా అని సంఘాలు మండిపడుతున్నాయి.

బీసీలకు ఆత్మగౌరవ భవనాలేవీ? 

బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. కానీ వీటిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాష్ట్రంలో మొత్తం 147 బీసీ కులాలు, ఉప కులాలు ఉన్నాయి. సర్కారు మాత్రం 40 కులాలకే ల్యాండ్‌‌ కేటాయించి వదిలేసింది. భవన నిర్మాణాలను గాలికొదిలేసింది. మిగతా 100కు పైగా కులాలకు మొండిచెయ్యి చూపించింది. ముఖ్యంగా బీసీ డీ, బీసీ ఈ జాబితాల్లోని ఉప కులాలకు అన్యాయం జరుగుతోంది. ఈ జాబితాలో పదుల సంఖ్యలో ఉప కులాలు ఉంటే, అందులో పావు వంతు కులాలను కూడా పట్టించుకోలేదు. ఎస్టీల్లో 33 తెగలు ఉండగా బంజార, ఆదివాసీ భవన్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన కొత్తలో స్టార్ట్‌‌ చేస్తే ఇవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మొన్న కమ్మ, వెలమ కులాలు దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయించినట్లు జూన్‌‌ 30న విడుదల చేసిన జీవోలో సర్కారు పేర్కొంది. అయితే మూడేండ్ల కిందనే అనేక కులాలు భవనాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో రెడ్లకు స్థలం కేటాయించినప్పుడే.. 16 మాల సంఘాలు కలిసి మాల సంఘాల సమన్వయ సమితిగా ఏర్పడి సీఎం కేసీఆర్‌‌కు దరఖాస్తు చేసుకున్నాయి. తమ కులానికి ల్యాండ్‌‌ ఇవ్వాలని, బిల్డింగ్‌‌ కట్టించాలని కోరాయి. కానీ అది పెండింగ్‌‌లోనే ఉండిపోయింది.

అగ్రకులాలకు 5 ఎకరాలకు తక్కువ ఇయ్యలే

రాష్ట్ర సర్కార్ అగ్రకులాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసీలు అయిన రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, కమ్మ కులాలకు పెద్ద పీట వేస్తోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకు సర్కార్​ కుల సంఘాలకు కేటాయించిన స్థలాల్లో ఎక్కువగా పెద్ద కులపోళ్లకే ఉన్నాయి. రెడ్లకు 10 ఎకరాలు, బ్రాహ్మణులకు 6.1 ఎకరాలు, తాజాగా కమ్మ, వెలమలకు ఖరీదైన 10 ఎకరాల భూములు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ కులానికీ 5 ఎకరాల కంటే ఎక్కువగా ల్యాండ్‌‌ కేటాయించలేదు. దీంతో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మండిపడుతున్నారు.

2018లోనే అడిగినం

తెలంగాణ మాల సంఘాల సమన్వయ సమితి ద్వారా 2018లో మాల భవన్ కావాలంటూ సీఎం కేసీఆర్​ను అడిగినం. కానీ మూడేండ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ వెలమ, కమ్మ కులాలకు స్థలాలు ఇచ్చారు. ఇది కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలపై వివక్షే.
‑ బత్తుల రాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం, ప్రెసిడెంట్

ఉద్దేశపూర్వక వివక్షే

తెలంగాణ ఏర్పడినప్పుడు మాదిగలకు ఐదెకరాల భూమి, 10 కోట్లతో కుల భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఏడేళ్లవుతున్నా గజం భూమి ఇవ్వలేదు. ఒక రూపాయీ విడుదల చేయలేదు. 18 శాతం ఉన్న ఎస్సీలను ఎందుకు పట్టించుకోరు. ఇది ఉద్దేశపూర్వక వివక్షే. 
- ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ  రిజర్వేషన్ పోరాట సమితి, రాష్ట్ర అధ్యక్షుడు