- స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ పట్టు
- ఇప్పటికే 118 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం
- పశ్చిమాసియా పరిణామాలపైనా డిబేట్
- విప్ జారీ చేసిన అధికార, ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పండుగలు, సెలవుల కారణంగా 17 రోజులు మాత్రమే సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే, అజెండాలోని మొదటి అంశంగా ఉన్న లోకసభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం, సహా కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్ సభ స్పీకర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, మహ్మద్ జావేద్, కె.సురేశ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకం చేశారు.
ఈ నేపథ్యంలో తమ ఎంపీలు అందరూ సభా కార్యకలాపాలకు తప్ప నిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిక్షం కాంగ్రెస్ కూడా విప్ జారీ చేశాయి. స్పీకర్ పై అవిశ్వాసం తీర్మానం, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న పరిణామాలు, ఇతర అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే... వెస్ట్ బెంగాల్ లో అంతర్జాతీయ సంతల్ కాన్ క్లేవ్ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు జరిగిన అవమానం, ఏఐ సమిట్ లో యూత్ కాంగ్రెస్ నేతల అర్ధనగ్న ప్రదర్శన, ఇతర అంశాలపై విపక్షాలకు కౌంటర్ ఇస్తూ ఎన్డీఏ కూటమి కూడా
చర్చించనుంది.
చర్చలో మా వాదన వినిపిస్తాం: విపక్షాలు
స్పీకర్ పై ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోయినా... ఈ తీర్మానంపై జరిగే చర్చలో తమ వాదనలు స్పష్టంగా వినిపించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆదివారం స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో తమ అభిప్రాయాలను చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పూర్తిస్థాయి స్వల్పకాలిక చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, ఇండియా– -అమెరికా వాణిజ్య ఒప్పందం, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తు న్న చమురు విషయంలో అమెరికా ఒత్తిడి వంటి కీలక అంశాలు కూడా చర్చించాల్సిందే అని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.
ఓం బిర్లాకు కేబినెట్ స్థానాన్ని కేటాయించే చాన్స్
స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అధ్యక్షత వహించే అవకాశం ఉండదు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ కమిటీలోని సీనియర్ మోస్ట్ ఎంపీ సభను నడిపిస్తారు. ప్రస్తుతం కమిటీలో సీనియర్ మోస్ట్ గా ఉన్న ఎంపీ జగదాంబికా పాల్ చర్చకు అధ్యక్షత వహించవచ్చని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. లోక్ సభ నిబంధనల ప్రకారం స్పీకర్ బిర్లా సభకు హాజరుకావచ్చు. ఇందుకోసం ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రులలోని ఒక సీటును కేటాయించే అవకాశం ఉంది.
