తుది దశకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు

 తుది దశకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు
  • త్వరలో బోయిగూడ వైపు టెర్మినల్ ప్రారంభం
  • వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం పనులు
  • వివరాలు వెల్లడించిన రైల్వే జీఎం సంజయ్​కుమార్​శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రూ.730 కోట్ల చేపట్టిన ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్​ఫారం నం.10 బోయిగూడ వైపు పనులు పూర్తి కావడంతో వచ్చే నెల ఆఖరు వారంలో ప్రారంభించనున్నట్టు రైల్వే జనరల్​మేనేజర్​సంజయ్​కుమార్​శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే ఈ వైపున నిర్మించిన అండర్ గ్రౌండ్ పార్కింగ్ యార్డు, ఆధునిక వెయిటింగ్ హాల్స్, క్యాంటీన్ వంటివి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్​ను శనివారం ఆయన తనిఖీ చేసి పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, పార్కింగ్ వంటి సదుపాయాల పురోగతిని పరిశీలించి, పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఏవో(కన్‌స్ట్రక్షన్) ఎం. రణధీర్ రెడ్డి, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.