వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు

వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు

హైదరాబాద్: దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తొలుత వ్యాక్సినేషన్‌కు భయపడిన ప్రజలు.. ఇప్పుడు మాత్రం టీకా తీసుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కరోనా నుంచి రక్షణగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు, సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరిలో వ్యాక్సిన్‌పై భయాందోళనలు ఉన్నాయి. అలాంటి ఓ యువకుడే పి.శివ ప్రకాశ్. 22 ఏళ్ల శివ ప్రకాశ్ కేపీఆర్ కాలనీలోని నిలయం అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. 

వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని శివ ప్రకాశ్‌లో భయం ఏర్పడింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని అతడ్ని పలు వారాలుగా బతిమిలాడుతున్నారు. అయితే ఏవో కారణాలు చెప్పి వ్యాక్సిన్ తీసుకోకుండా అతడు నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో టీకా విషయంపై ప్రకాశ్‌కు సోదరుడు, తల్లితో ఈనెల 12న వాగ్వివాదం జరిగింది. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రకాశ్ పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు అతడ్ని జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే అతడు ప్రాణాలు వదిలాడు. ప్రకాశ్ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, తల్లపాలెం గ్రామం. కాగా, ప్రకాశ్ మృతిపై సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద రాయదుర్గం పోలీసులు కేసును నమోదు చేశారు.