కల్లు తాగాడు…ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

కల్లు తాగాడు…ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

కరోనా వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు చెబుతున్నారు. అయినా ఓ యువకుడు పొలం పనులకోసం బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూ దారి మధ్యలో కల్లు తాగాడు. పోలీసు వాహనం సైరన్ శబ్ధం విని…భయంతో పారిపోయేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది.

పర్వతగిరి మండలం లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఆ మండలంలోని ఏనుగల్లు మాల్యా తండాకు చెందిన బానోత్ దేవేందర్ పొలం పనులు చేసుకునేందుకు పారాలు కొనడానికి..అతని బంధువుతో బైక్ పై నెక్కొండ మండలంకు వెళ్లారు. అయితే షాపులు మూసివేసి ఉండటంతో తిరిగు ప్రయాణమయ్యారు. ఏనుగల్లు చేరుకోగానే అక్కడ గీత కార్మికుడు కల్లు అమ్ముతుండడంతో తాగారు. పోలీస్ వెహికల్ వస్తుండడంతో భయపడి పొలాలపై  పరుగు తీసిన దేవేందర్ కాలు జారీ వ్యవసాయ బావిలో పడ్డాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…అతని నడుము విరిగిందని గుర్తించి… స్థానికుల సాయంతో బావిలో నుంచి బయటకు తీసి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.