Virat Kohli: పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ రిటైర్మెంట్.. కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ నిజమేనా?

Virat Kohli: పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ రిటైర్మెంట్.. కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ నిజమేనా?

Virat Kohli: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఒక స్క్రీన్‌షాట్ వైరల్‌గా మారింది. ఆ స్క్రీన్‌షాట్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సర్ఫరాజ్‌కు అభినందనలు తెలిపినట్లు కనిపిస్తుంది. కాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ స్క్రీన్‌షాట్ డిజిటల్‌గా ఎడిట్ చేసినదని, కోహ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అలాంటి స్టోరీ ఎప్పుడూ పెట్టలేదని తెలుస్తుంది. 

మార్చి 15న సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన కెరీర్‌లో వికెట్‌కీపర్+ -బ్యాటర్‌గా పాకిస్థాన్‌కు సేవలందించాడు. ముఖ్యంగా 2017లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీలో అతడి కెప్టెన్సీలో పాక్ టీమ్ చారిత్రక విజయం సాధించింది. ఫైనల్లో టీమిండియాని ఓడించి ట్రోఫీని గెలుచుకోవడంతో ఆ జట్టుకి జీవితకాలం గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది. కాగా రిటైర్మెంట్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్‌లో కోహ్లీ ఇలా మెసేజ్ పెట్టింది కనిపిస్తుంది.
 
 సర్ఫరాజ్ అహ్మద్ అద్భుతమైన క్రికెటర్.. పాకిస్థాన్‌కు మీరు చూపిన నాయకత్వం, అంకితభావం ప్రశంసనీయం.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పాకిస్థాన్ క్రికెట్‌కు ప్రత్యేకమైన క్షణం.. మీ భవిష్యత్తు ప్రయాణానికి శుభాకాంక్షలు అని ఆ పోస్టులో రాసి ఉంది. అయితే కోహ్లీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను పరిశీలించగా అలాంటి స్టోరీ ఎక్కడా కనిపించలేదు. అలాగే విశ్వసనీయ మీడియా సంస్థలలో కూడా ఈ విషయంపై ఎలాంటి రిపోర్టులు కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్ నకిలీదిగా తేలింది. ప్రముఖ క్రీడాకారుల పేర్లతో ఇలాంటి ఎడిట్ చేసిన పోస్టులు తరచుగా వైరల్ చేస్తుంటారని తేలింది.