60  ఏండ్లు నిండిన వారితో ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్

60  ఏండ్లు నిండిన వారితో ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 18 నుంచి 60 ఏండ్ల వరకు ఉన్న మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లే వృద్ధులకూ స్వయంసహాయక సంఘాలు ఏర్పాటు కాబోతున్నాయి. వృద్ధుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం  దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఏజీఆర్ఏఎస్ఆర్ స్కీమ్ లో భాగంగా ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (ఈఎస్ హెచ్ జీ) లను ఏర్పాటు చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్),  పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు. బిహార్ లో గత పదేండ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఇలాంటి సంఘాలు ఈ ఏడాది ఏపీ, కర్నాటక, ఒడిశా, తమిళనాడు సహా 15 రాష్ట్రాల్లో  ఏర్పాటయ్యాయి. త్వరలో మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 60 ఏండ్లు నిండిన వృద్ధులను గుర్తించాలని  ఇప్పటికే సెర్ప్ సిబ్బందికి డీఆర్డీఓలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈఎస్​హెచ్​జీల్లో 60 ఏండ్లు నిండిన పురుషులు, మహిళలు ఒకే గ్రూపు లో ఉండొచ్చు. లేదా వేర్వేరుగా సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఒక గ్రూపులో కనీసం 10 మంది ఉండాలి. గిరిజన ఆవాసాల్లో కనీసం ఐదుగురు సభ్యులతోనూ గ్రూపు ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిలో తమ వ్యక్తిగత పనులను తామే చేసుకుంటూ, జీవన ఉపాధి కోసం ఇతర పనులను చేసుకోగలిగేవాళ్లను ఒక కేటగిరీగా,  వ్యక్తిగత పనులును తామే చేసుకుంటూ ఉపాధి కోసం పనులు  ఏమీ  చేసుకోలేని వారిని మరో  కేటగిరీగా గుర్తిస్తారు.  మానసికంగా కుంగిపోతున్న వృద్ధులను ఒకచోట చేర్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో  మాట్లాడుకునేలా ప్రోత్సహించడం, సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా మనోధైర్యాన్ని కల్పించడం ఈ సంఘాల ప్రధాన ఉద్దేశం.  

కేంద్రం నుంచి 50 వేల సాయం..

కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థిక సాయం చేసినట్లే ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూ కేంద్రం సహాయం అందించనుంది. గ్రూప్ ఫార్మేషన్  చేసి పోర్టల్ లో ఎంట్రీ చేయగానే రూ.5 వేలు, గ్రూపు ట్రైనింగ్, ఒరియంటేషన్ కోసం మరో రూ.5 వేలు, ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ ఫండ్ కింద రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేలు కలిపి మొత్తం రూ.50 వేలు జమ  చేయనుంది. సొంతంగా ఆదాయం పెంచుకోవాలని భావించే సీనియర్ సిటిజన్స్ కు మెరుగైన ట్రైనింగ్ ఇప్పించి బ్యాంక్ నుంచి రుణాలు అందేలా చూస్తారు. డెయిరీ, కిచెన్ గార్డెనింగ్, టీచింగ్, క్యాండిల్ మేకింగ్, హైటెక్ వెజిటేబుల్స్, కుట్టు, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం, ఔషధ మొక్కలు, కూరగాయల విత్తనోత్పత్తి, పండ్ల నర్సరీ నిర్వహణ లాంటి పనుల్లో శిక్షణ ఇస్తారు.