ఓటరు లిస్టులో అవకతవకలు.. సవరణ చేయాలి:మర్రి శశిధర్రెడ్డి

ఓటరు లిస్టులో అవకతవకలు.. సవరణ చేయాలి:మర్రి శశిధర్రెడ్డి

ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాను సవరించాలె : మర్రి శశిధర్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటరు లిస్టు తయారీలో చాలా అవకతవకలు జరిగాయని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కరెక్ట్​గా పనిచేయలేదని, అనేక చోట్ల చాలా ఓట్లు గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులతో కలిసి శశిధర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను హడావుడిగా ప్రకటించిందని విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను తొలగించాలని కోరితే.. అసలైన ఓట్లను తొలగించారని ఆయన మండిపడ్డారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

ALSO READ : నా కుటుంబ సభ్యులారా.. తెలంగాణలో మోదీ మంత్రం

ఈసీని తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని శశిధర్​రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రచన శ్రీ, అమృత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.