భట్టి ఇంట్లో కాంగ్రెస్​ సీనియర్ల అత్యవసర భేటీ

భట్టి ఇంట్లో కాంగ్రెస్​ సీనియర్ల అత్యవసర భేటీ
  • రేవంత్​ను బాయ్​కాట్​ చేయాలని నిర్ణయం
  • పీసీసీ చీఫ్​ మీటింగ్‌‌లకు వెళ్లొద్దని నేతల తీర్మానం
  • ఒరిజినల్​ లీడర్లకు కాకుండా వలసొచ్చినోళ్లకే  పదవులు ఇస్తున్నారని ఫైర్​
  • త్వరలోనే హైకమాండ్​కు ఫిర్యాదు.. ఒకటీ రెండు రోజుల్లో మళ్లీ సమావేశం
  • నోరు మెదపొద్దని రేవంత్​ వర్గానికి హైకమాండ్​ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డిపై కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ లీడర్లు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనను బాయ్​కాట్​ చేయాలని నిర్ణయించారు. ‘సేవ్‌‌ కాంగ్రెస్‌‌’ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ఇతర పార్టీల్లోంచి వలస వచ్చిన వాళ్లకే  పీసీసీ కమిటీల్లో ప్రయారిటీ ఇచ్చారని , రేవంత్‌‌  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన సంగతిని పార్టీ హైకమాండ్‌‌ వద్ద తేల్చుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ పార్టీకి రేవంత్‌‌ సహా ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో సీతక్క మినహా ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. పీసీసీ చీఫ్​ రేవంత్​పై గుర్రుగా ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో శనివారం ఉదయం కాంగ్రెస్​ సీనియర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. రేవంత్‌‌ వ్యవహారశైలి, కాంగ్రెస్‌‌ కమిటీలు సహా పలు అంశాలపై ఇందులో చర్చించారు. 

సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్‌‌‌‌ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కోదండరెడ్డి, మధుయాష్కీ గౌడ్‌‌‌‌, యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు శివాసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌‌‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌‌‌‌ సాగర్‌‌‌‌ రావు, జూమ్‌‌‌‌లో ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు. ఇదే అంశంపై శుక్రవారం భట్టి ఇంట్లో జరిగిన మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌ రెడ్డి పాల్గొని చర్చించారు. శనివారం సమావేశం అనంతరం కాంగ్రెస్‌‌‌‌ నేతలు మీడియాతో మాట్లాడారు. పొలిటికల్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ కమిటీ, ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కమిటీ సహా పీసీసీ చీఫ్​ రేవంత్‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించే ఏ మీటింగ్‌‌‌‌లోనూ పాల్గొనకూడదని నిర్ణయించారు. ఆదివారం గాంధీ భవన్‌‌‌‌లో జరిగే మీటింగ్‌‌‌‌లకు కూడా దూరంగా ఉంటామన్నారు. రేవంత్‌‌‌‌  వ్యవహారశైలిపై  హైకమాండ్‌‌‌‌కు ఫిర్యాదు చేయడానికి ముందు మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో ఒకటి, రెండు రోజుల్లో ఈ మీటింగ్‌‌‌‌ జరుగనుంది.  కాగా, కాంగ్రెస్‌‌‌‌  సీనియర్లు  ఏ నిర్ణయం తీసుకున్నా తాను కలిసి వస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి అన్నారు. శనివారం భట్టి విక్రమార్కకు  ఫోన్‌‌‌‌ చేసి రేవంత్‌‌‌‌పై పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 

  • సేవ్​ కాంగ్రెస్​ నినాదంతో ముందుకు: భట్టి
  • సొంత లీడర్లపైనే సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టింగులా?: ఉత్తమ్‌‌
  • మమ్మల్నే కోవర్టులంటరా?: జగ్గారెడ్డి
  • కాంగ్రెస్​ కల్చర్​ తెలియనోళ్లకు పదవులా?: దామోదర
  • అన్ని జిల్లాల్లోనూ కార్యకర్తలకు అన్యాయం జరిగింది: మధుయాష్కీ

సీఎల్పీ నేత అభిప్రాయాన్ని కూడా తీసుకోరా?

పీసీసీ కమిటీల నియామకంలో రేవంత్‌‌‌‌ ఏకపక్షంగా వ్యవహరించారని, మాణిక్కం ఠాగూర్‌‌‌‌ దీనికి సంపూర్ణ సహకారం అందించారని సీనియర్‌‌‌‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తనను పొలిటికల్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ కమిటీలో కాకుండా ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కమిటీలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రేవంత్‌‌‌‌ ను కలిసి ఆ పదవికి రాజీనామా చేశారు. బెల్లయ్య నాయక్‌‌‌‌ సహా మరికొందరు నాయకులు కూడా కమిటీల నియామకంపై మండిపడ్డారు. తమను అవమానించారని, ఐదారు నెలల కిందట ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారికి డీసీసీ చీఫ్​ పదవులు ఇవ్వడంతో పాటు ఇతర కీలక పదవులు కట్టబెట్టారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన కమిటీల నియామకంలో కనీసం సీఎల్పీ నేత అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.  

సేవ్​ కాంగ్రెస్​ నినాదంతో ముందుకు: భట్టి

సేవ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నినాదంతో ముందుకెళ్తామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క  ప్రకటించారు. ‘‘ఇతర పార్టీల నుంచి వలస వచ్చినోళ్లకు పదవులు ఇస్తారా? కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తున్న వారికి చోటు కల్పించకపోవడం నన్ను మనస్తాపానికి గురి చేసింది. అసలైన కాంగ్రెస్‌‌‌‌ నాయకులకు కాకుండా వలసొచ్చినోళ్లకు పదవులు ఇచ్చారని పలువురు నేతలు నాకు చెప్పి వాపోతున్నారు. సీఎల్పీ నేతగా నేను ఈ ప్రక్రియలో పాలుపంచుకోలేదని వారికి చెప్తున్నాను. జరిగిన నష్టాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోతాం” అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. 

సొంత లీడర్లపై తప్పుడు పోస్టింగులా?: ఉత్తమ్‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌ పార్టీ నాయకులపై తప్పుడు పోస్టింగులు పెట్టిస్తున్నారని ఎంపీ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి మండిపడ్డారు. సునీల్‌‌‌‌ కనుగోలు ఆఫీస్‌‌‌‌పై దాడి ఘటనలో తాను సీపీ ఆనంద్‌‌‌‌తో మాట్లాడనని.. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ నేతలతో పాటు తనను కూడా కించపరిచేలా అక్కడ పోస్టింగ్‌‌‌‌లు పెడుతున్నట్టు ఆయన చెప్పారని అన్నారు. ‘‘మేము పుట్టుక నుంచి చావు వరకు కాంగ్రెస్‌‌‌‌ పార్టీనే నమ్ముకున్నాం. సీనియర్‌‌‌‌ నేతలమంతా కలిసి మాట్లాడుకున్నాం.. సేవ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌  పేరుతో పార్టీని కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చాం” అని తెలిపారు. కొందరు పార్టీని క్యాప్చర్‌‌‌‌ చేసే పనిలో ఉన్నారని, పార్టీ అంటేనే తామే అనే ఆలోచనతో అనుకూలమైన వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘26 డీసీసీలకు అధ్యక్షులను నియమిస్తే వారిలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.  108 మందికి పార్టీ పదవులు ఇస్తే అందులో 50 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానాన్ని కలుస్తాం” అని పేర్కొన్నారు. 

మమ్మల్నే కోవర్టులంటరా?: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ పార్టీ కోసం కష్టపడుతున్న తమనే కోవర్టులంటూ ముద్ర వేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీలోకి వలస నేతలు వచ్చాకే ఈ కోవర్టు అనే పదం వచ్చింది. రాహుల్‌‌‌‌ గాంధీ అంటే పిచ్చితో ఆయన పాదయాత్ర సక్సెస్‌‌‌‌ చేశాం.. అలాంటి మమ్మల్నే కోవర్టులంటూ సోషల్‌‌‌‌ మీడియాలో ప్రచారం చేస్తున్నరు. మాపై సోషల్‌‌‌‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వలస వచ్చిన నాయకుడితో పాటు ఏఐసీసీ కూడా ఖండించలేదు. మరియమ్మ లాకప్‌‌‌‌ డెత్‌‌‌‌, దళితబంధు అమలు సహా ఇలా అనేక ప్రజా సమస్యలపై మేం గళమెత్తుతున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు చెప్తాం” అని ఆయన అన్నారు. 

కాంగ్రెస్​ కల్చర్​ తెలియనోళ్లకు పదవులా?: దామోదర

కాంగ్రెస్‌‌‌‌ పార్టీని కాపాడటమే తమ లక్ష్యమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. తాను పుట్టిందే కాంగ్రెస్‌‌‌‌ పార్టీలోనని, తమ కుటుంబానికి కాంగ్రెస్‌‌‌‌తో 50 ఏండ్ల అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ కల్చర్‌‌‌‌కు సంబంధం లేనివాళ్లకు పీసీసీ కమిటీల్లో పదవులు వచ్చాయని దుయ్యబట్టారు. తమను కోవర్టులంటూ కొందరు పోస్టింగులు పెడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ హైకమాండ్​ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామని ఆయన అన్నారు.

కార్యకర్తలకు అన్యాయం జరిగింది: మధుయాష్కీ

‘‘మాపై  తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్‌‌‌‌ మీడియా ఖబడ్దార్‌‌‌‌’’ అని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌‌‌‌ హెచ్చరించారు. వలస వచ్చిన వాళ్లకు, కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలకు మధ్య పంచాయితీ వచ్చిందని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. పీజేఆర్‌‌‌‌ కొడుకు విష్ణుకు కూడా కమిటీల్లో అవకాశం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.

భేటీకి నన్ను కూడా పిలవాల్సింది : వెంకట్‌‌‌‌ రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేతల సమావేశానికి తనను కూడా పిలవాల్సిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టికి ఫోన్‌‌‌‌ చేసి ఇకపై జరిగే సమావేశాలకు తనను కూడా పిలవాలని ఆయన కోరారు. తాను ఎవరినీ పిలవలేదని, అనుకోకుండా ఈ సమావేశం జరిగిందని, ఎవరికి వాళ్లుగానే తన ఇంటికి వచ్చారని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీని రక్షించుకునే విషయంలో సీనియర్‌‌‌‌ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను వారి వెంటే ఉంటానని వెంకట్​రెడ్డి చెప్పారు. 

నోరు విప్పొద్దని రేవంత్​ వర్గానికి  హైకమాండ్‌‌‌‌  ఆదేశం!

పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ సీనియర్ల తిరుగుబాటు ఎపిసోడ్‌‌‌‌ నేపథ్యంలో రేవంత్‌‌‌‌ వర్గీయులెవరూ నోరు విప్పొద్దని కాంగ్రెస్​ హైకమాండ్‌‌‌‌ ఆదేశించినట్టు తెలిసింది. ఆదివారం ఏఐసీసీ సెక్రటరీలు హైదరాబాద్‌‌‌‌కు వచ్చి.. అసంతృప్త నేతలతో భేటీ అవుతారని సమాచారం. పార్టీ హైకమాండ్‌‌‌‌ ఆదేశాలకు ముందు.. సీనియర్ల ఆరోపణలపై మల్లు రవి స్పందించారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్లలో ఎంత మందికి పీసీసీ కమిటీల్లో పదవులు ఇచ్చారనే జాబితాను ఆయన విడుదల చేశారు. టీడీపీ నుంచి వచ్చినవాళ్లలో 29 మందికి.. బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, వైసీపీ నుంచి వచ్చినవాళ్లలో మరికొందరికి పదవులు ఇచ్చామని, సీనియర్‌‌‌‌ నేతలు ఆరోపిస్తున్నట్టుగా టీడీపీ నుంచి వచ్చినవాళ్లలో 50 మందికి పదవులు ఇవ్వలేదని మల్లు రవి తెలిపారు.

పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గుస్సా

రేవంత్‌‌‌‌ రెడ్డి పీసీసీ చీఫ్‌‌‌‌ అయిన నాటి నుంచి కాంగ్రెస్‌‌‌‌ ఒరిజినల్​ లీడర్లకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే  ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్‌‌‌‌ లీడర్లు కోపంగా ఉన్నారు. అన్నిట్లో  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, స్థానిక లీడర్లకు చెప్పకుండానే జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వ్యక్తి సెంట్రిక్‌‌‌‌గా ప్రచారం జరిగేలా చూస్తున్నారంటూ రేవంత్​పై  పలుమార్లు కాంగ్రెస్​ హైకమాండ్​కు వాళ్లు ఫిర్యాదులు చేశారు. రేవంత్‌‌‌‌ దూకుడుగా వ్యవహరించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌‌‌ కూడా కారణమని సీనియర్‌‌‌‌ నేతలు గతంలో బాహాటంగానే దుయ్యబట్టారు. రేవంత్‌‌‌‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులే సోషల్‌‌‌‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతున్నారని కాంగ్రెస్​ సీనియర్‌‌‌‌ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల పోలీసులు సీజ్‌‌‌‌ చేసిన కాంగ్రెస్‌‌‌‌ వార్‌‌‌‌ రూమ్‌‌‌‌ (సునీల్‌‌‌‌ కనుగోలు పొలిటికల్‌‌‌‌ స్ట్రాటజీ ఆఫీస్‌‌‌‌) కేంద్రంగానూ పలువురు కాంగ్రెస్‌‌‌‌ నేతలను అవమానించేలా పోస్టింగ్‌‌‌‌లు పెట్టించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌‌‌‌ కోసం పనిచేస్తున్న టీమ్​ సొంత పార్టీ నేతలపై ఇలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టింగ్‌‌‌‌లు పెట్టించడం వెనుక రేవంత్‌‌‌‌ రెడ్డే ఉన్నారని సీనియర్లు అనుమానిస్తున్నారు.