రేవంత్ సమావేశానికి సీనియర్ల డుమ్మా

రేవంత్ సమావేశానికి సీనియర్ల డుమ్మా

తెలంగాణ కాంగ్రెస్‭లో రోజురోజుకి సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై నిన్న నిరసన గళం వినిపించిన ఏ ఒక్కరు కూడా.. మీటింగ్‭కు హాజరుకాలేదు. ఏఐసీసీ ఆదేశాలతో జరుగుతున్న సమావేశానికి సీనియర్లు వస్తారని రేవంత్ వర్గం భావించింది. కానీ.. రేవంత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్లు ముందుగా నిర్ణయించుకున్నట్లే.. ఇవాళ్టి సమావేశానికి రాలేదు. కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో సన్నాహక సమావేశం రేవంత్, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా.. మీటింగ్‭కు భట్టి రాలేదు. రేవంత్ ఒక్కరే సమావేశానికి వచ్చారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అద్దంకి దయాకర్, మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు, ఫిరోజ్ ఖాన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

 

రేవంత్ సపోర్టర్స్ మాత్రం.. సీనియర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే, రేవంత్ తప్పు చేస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ బహిరంగ విమర్శలు కరెక్ట్ కాదన్నారు. కార్యకర్తలు పనిచేస్తేనే అందరూ నాయకులం అయ్యామని.. నాయకులుగా ఎదిగాక అధిష్టానం నియమించిన పీసీసీ చీఫ్ పై ఈ విధంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

ఇదేమీ కొత్త కాదు: జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి చాలా జరిగాయని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తాను ఏది బహిరంగంగా మాట్లాడను అని చెప్పారు. తాను ఏది ఉన్నా అంతర్గతంగా చర్చిస్తానని వెల్లడించారు. కమిటీ విషయంలో గతంలో కూడా ఎన్నో గొడవలు జరిగాయని.. ఇది కొత్తేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.