- సమీప గ్రామాల్లో కీడు వంటలు
- వరస మరణాలతో గ్రామస్తుల భయాందోళన
- జమ్మికుంట మండలం గండ్రపల్లిలో ఘటన
జమ్మికుంట, వెలుగు: గ్రామానికి కీడు సోకిందన్న భయంతో గ్రామస్తులు ఊరంతా ఖాళీ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామంలో కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి దుష్ట ప్రభావం పడిందనే నమ్మకంతో ఆదివారం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాన్ని విడిచిపెట్టారు.
సమీప ప్రాంతాలకు వెళ్లి కీడు వంటలు చేసుకుంటూ ఆచారాలను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల వల్ల గ్రామం ఖాళీ కావడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
