- వ్యాపారం కోసం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల రుణం
- రాష్ట్రవ్యాప్తంగా 4 వేల యూనిట్లు గుర్తించాలని సెర్ప్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే డ్వాక్రా మహిళలకు లేదా మహిళా గ్రూపులకు భారీగా రుణాలు ఇప్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర బిజినెస్ షురూ చేసేందుకు రూ.10 లక్షల దాకా బ్యాంకు లింకేజీ లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో సీసీ పరిధిలో 2యూనిట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 వేల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సెర్ప్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.
గతంలో డ్వాక్రా మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కిరాణా, వివిధ వ్యాపారాల కోసం ఇతరుల నుంచి ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకున్నట్లు సెర్ప్ పరిశీలనలో వెల్లడైంది. దీంతో తక్కువ వడ్డీకే మొత్తం లోను ఇప్పించాలని వారు నిర్ణయించారు. గతంలో రూ.10 లక్షల దాకా లోన్ తీసుకుని క్రమం తప్పకుండా కిస్తీలు కట్టిన సంఘాలు, మహిళలకే యూనిట్లు మంజూరు చేయాలనే నిబంధన విధించారు. ఇలా చెల్లించిన గ్రూపు మొత్తానికి లేదా ఒక మహిళకు వ్యక్తిగతంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా లోన్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ నెలాఖరులోగా 2వేల యూనిట్లను గ్రౌండింగ్ చేసి, సెర్ప్ పోర్టల్ లో ఎంట్రీ చేయనున్నారు. మరో 2వేల యూనిట్లను మార్చి 2023 దాకా పూర్తి చేయాల్సి ఉంటుంది.

