
పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక పోవటంతో.. డాక్టర్లను దేవుళ్లుగా భావించి తమకు సంతానం కలిగేలా చేస్తారని నమ్మకంతో వెళ్లిన దంపతులను దారుణంగా మోసం చేశారు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో నిందితులను రిమాండ్ కు తరలించారు. ఆదివారం (జులై 27) మారేడుపల్లిలో జడ్జి క్వాటర్స్ లో జడ్జి ఎదుట ఏడుగురు నిందితులను ప్రవేశపెట్టారు గోపాలపురం పోలీసులు. న్యాయమూర్తి నిందితులకు14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఏడుగురిన చంచల్ గూడా జైలుకు తరలించారు.
అసలు ఏం జరిగిందంటే..
సికింద్రాబాద్ మారేడ్ పల్లికి చెందిన దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్ కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ఆశ్రయించారు. అయితే, ఆమె భర్త నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేశారు. పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఓ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. శిశువుకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయట పడింది. తమ వంశంలో ఎవరికీ క్యాన్సర్ లేదని, మళ్లీ ఒకసారి పూర్తిగా టెస్టులు చేయాలని బాధిత దంపతులు కోరగా.. డాక్టర్లు డీఎన్ఏ టెస్టు చేశారు.
బాబుకు, తండ్రి డీఎన్ఏకు సంబంధం లేదని టెస్టుల్లో తేలింది. దీంతో దిగ్ర్భాంతికి గురైన బాధిత దంపతులు.. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆసుపత్రిలో శనివారం (జులై 26) రోజంతా సోదాలు చేశారు. పేషెంట్ల ట్రీట్మెంట్కు సంబంధించిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందికి వేరేవారి వీర్యంతో ఐవీఎఫ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.