- ‘క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఆవిష్కరణలో వక్తలు
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో సామాజిక న్యాయం సమగ్ర కులగణనతోనే సాధ్యమని పలువురు ఎంపీలు అన్నారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఓబీసీఎస్ఏ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్, ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ విల్సన్, బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, నేషనల్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, ఓబీసీ హక్కుల ఉద్యమ నాయకురాలు రత్నా సేతుపతి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కులగణన కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించడం ద్వారా ప్రభుత్వ విధాన నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా, న్యాయంగా రూపొందించుకోవచ్చని చెప్పారు. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలు, అణగారిన వర్గాల అభివృద్ధికి అవసరమైన వనరుల కేటాయింపులో కులగణన ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
