- రెండేండ్ల కిందటి కేసును ఛేదించిన షాద్నగర్ పోలీసులు
- నామినీపై ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానాలు
- పోలీసులకు ఫిర్యాదుతో నిజం వెలుగులోకి..
- నిందితుడు, హత్యకు ప్లాన్ వేసిన కానిస్టేబుల్ అరెస్ట్
షాద్ నగర్, వెలుగు: రెండేండ్ల కిందట రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద శివారులో అనుమానాస్పదంగా చనిపోయిన వ్యక్తి మృతి కేసును షాద్ నగర్ పోలీసులు ఛేదించారు. తనకు బినామీగా ఉన్న వ్యక్తిని ఇన్సూరెన్స్ పైసల కోసం నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఎస్ వోటీ కానిస్టేబుల్ తో కలిసి హత్యచేసి దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు గుర్తించారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కు సంబంధించి నామినీ విషయంలో సదరు కంపెనీకి అనుమానం రావడంతో నిజం బయటపడింది. ఈ కేసు వివరాలను సోమవారం షాద్ నగర్ పీఎస్ లో మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ (27) హైదరాబాద్ సిటీకి వచ్చి బాచుపల్లి ఏరియాలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు.
దీంతోపాటు ఓ ఫేక్ కంపెనీ పెట్టి ఇతరుల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలోని నర్సంపేట మండలానికి చెందిన భిక్షపతి(28) శ్రీకాంత్ దగ్గర పనికి చేరాడు. భిక్షపతికి ఎవరూ లేకపోవడంతో 2020లో అతడి పేరు మీద శ్రీకాంత్ ఓ బ్యాంకులో రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత భిక్షపతిని తన బినామీగా మార్చుకున్న శ్రీకాంత్.. 2021లో మేడిపల్లి ఏరియాలో ఓ ఇల్లు కొన్నాడు. దాన్ని భిక్షపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంత కాలం తర్వాత శ్రీకాంత్ కు డబ్బులు అవసరం కావడంతో మేడిపల్లిలోని ఆ ఇంటిని అమ్మకానికి పెట్టాలనుకున్నాడు. కానీ భిక్షపతి అందుకు ఒప్పుకోలేదు. ఇల్లు భిక్షపతి పేరు మీద ఉండడంతో అతడిని చంపాలని శ్రీకాంత్ స్కెచ్ వేశాడు.
ఎస్వోటీ కానిస్టేబుల్ సాయంతో
2016 నుంచి మల్కాజిగిరి ఎస్ వోటీ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్ (43) తో శ్రీకాంత్ కు పరిచయం ఉంది. శ్రీకాంత్ ఆయన దగ్గరికెళ్లి తన సమస్యను చెప్పుకున్నాడు. భిక్షపతిని చంపితే రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పాడు. అందులో రూ.10 లక్షలు కావాలని మోతిలాల్ అడగంతో శ్రీకాంత్ అందుకు ఒప్పుకున్నాడు. దీంతో శ్రీకాంత్ దగ్గర పనిచేసే చాగంటి సతీశ్(29), బానోతు సమ్మన్న(32)తో కలిసి భిక్షపతి హత్యకు ప్లాన్ చేశారు. హత్యకు సహకరిస్తే సతీశ్, సమ్మన్నకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చేందుకు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. శ్రీకాంత్, మోతీలాల్, సతీశ్, సమ్మన్న నలుగురూ కలిసి 2021 ఫిబ్రవరి 23న భిక్షపతికి ఫుల్లుగా మద్యం తాగించి షాద్ నగర్ పరిధి ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద శివారుకు తీసుకెళ్లారు. అక్కడ హాకీ స్టిక్ తో అతడిని కొట్టి చంపారు. తర్వాత అతడిని రోడ్డుపై పడేసి కారుతో తొక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. తర్వాత భిక్షపతి ఇన్సూరెన్స్ రూ.50 లక్షలకు సంబంధించి నామినీగా ఉన్న శ్రీకాంత్ విషయంలో కంపెనీకి అనుమానాలు వచ్చాయి.
భిక్షపతికి ఎవరూ లేకపోవడం, అతడితో ఎలాంటి సంబంధం లేని శ్రీకాంత్ నామినీగా ఉండడంతో కంపెనీ నిర్వాహకులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. అదేవిధంగా మేడిపల్లి ప్రాంతంలో కొన్న ఇంటికి కూడా శ్రీకాంత్ ఇన్సూరెన్స్ చేయించాడు. ఈ వ్యవహారాన్నిమొదటి నుంచి అనుమానించిన షాద్ నగర్ పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఏసీపీ కుశల్కర్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాంబాబుతో కలిసి టీమ్ గా ఏర్పడి సాక్ష్యాలను సేకరించారు. భిక్షపతి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, శ్రీకాంత్, మోతీలాల్, సమ్మన్న, సతీశ్ కలిసి అతడిని చంపినట్లు నిర్ధారించారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులను రిమాండ్ కు తరలించామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
