షాద్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీకి రూ. 29.70 కోట్లు

షాద్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీకి రూ. 29.70 కోట్లు

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ నియోజకవర్గంలో సాంకేతిక విద్యను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 29.70 కోట్ల నిధులను మంజూరు చేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో లింగారెడ్డిగూడ వద్ద మూడు ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి ఈ నిధులు కేటాయించినట్లు వివరించారు.

నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 250 కోట్లతో కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరుగుతోందని, అలాగే తన సొంత ప్రయత్నంతో జూనియర్ కాలేజీ పనులు చేపట్టామని పేర్కొన్నారు. వీటితో పాటు కోట్లాది రూపాయలతో అత్యాధునిక ఇండోర్ స్టేడియం తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్, వైస్ చైర్మన్ అందె మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్ ఉన్నారు.