గుంటూరులో దారుణం.. పెళ్లి చేసుకోమంటే ముక్కలు గా నరికి కాల్చేశాడు

గుంటూరులో దారుణం.. పెళ్లి చేసుకోమంటే ముక్కలు గా నరికి కాల్చేశాడు

రెండేళ్ల తర్వాత బయటపడ్డ దారుణం

గుంటూరు: తల్లిదండ్రులను కాదనుకుని తనను నమ్మి వచ్చిన  ఓ యువతిని దుర్మార్గుడు వారం రోజులపాటు వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని గట్టిగా అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమనడంతో గట్టిగా నిలదీసిన యువతిని చంపేశాడు. మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి గోనె సంచిలో వేసుకుని వెళ్లి ఊరిబయట నిర్జన ప్రదేశంలో పడేసి ఆనవాళ్లు లేకుండా కాల్చేశాడు. 2018లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు అల్లీనగర్ కు చెందిన నిందితుడు షేక్ కరీమ్ అలియాస్ నాగూర్ ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వివరాలిలా ఉన్నాయి.

గుంటూరు అల్లీనగర్‌కు చెందిన షేక్‌ కరీమ్‌ అలియాస్‌ నాగూర్‌.. కరిముల్లా కుమార్తె నజీమాబేగం(28)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. 2009లో పాలిటెక్నిక్ చదివేటప్పటి నుండే పరిచయం కావడంతో ఆమె వెంటపడేవాడు. ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుంటాడని అతని మాటలు నమ్మి 2018 మే 25న నజీమాబేగం ఇంటి నుంచి వెళ్లింది. ఇంటి నుండి వచ్చేసిన నజీమాను కరీమ్ పాతగుంటూరులో తాను అద్దెకు ఉండే ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో నజీమా ప్రియుడ్ని గట్టిగా నిలదీసింది. దీంతో కోపంతో రగిలిపోయిన కరీం నిన్నెవరు చేసుకుంటారు.. నీ మీద మోజు తీరింది.. ఎవరినైనా చేసుకో… కావాలంటే నేను నీతో టచ్ లో ఉంటాననడంతో మోసపోయానంటూ విలపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. దీంతో ఆమెను మెడ పట్టుకుని గోడకేసి బాదాడు. తీవ్ర గాయంతో స్పృహ తప్పి చనిపోయింది. మరో వైపు కూతురు ఆచూకీ లేకపోవడంతో అదే ఏడాది జూన్‌ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు.

వారం రోజుల క్రితం నజీమా స్నేహితులు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 4వ తేదీన రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిసి షేక్ కరీం అలియాస్ నాగూర్ పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  నాగూర్‌పై నిఘాపెట్టి ఆధారాలు సంపాదించారు.  అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో దారుణం బయటపడింది. శవాన్ని ముక్కలు చేసి అర్ధరాత్రి తర్వాత గోనెసంచిలో మృతదేహం ముక్కలు తీసుకుని పాద సుద్దపల్లి డొంక సమీపంలో ఎవరూ తిరగని నిర్జన ప్రదేశంలో పడేశాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా  పెట్రోలు పోసి కాల్చేశానని నిందితుడు బయటపెట్టాడు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో  ప్రత్యేక బృందం పోలీసులు కేసును సవాల్ గా తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో దారుణ ఘటన  రెండేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.  నజీమా మిస్సింగ్ మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.