షేన్ వార్న్ మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్

షేన్ వార్న్ మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్

స్పిన్  లెజండ్ షేన్ వార్న్ ది సహజ మరణమేనని పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ప్రకటించారు థాయ్ పోలీసులు. డాక్టర్లు ఇచ్చిన ఆ రిపోర్టును వార్న్ కుటుంబానికి, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిపారు పోలీసులు. వార్న్ మృతిపై అతని కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు పోలీసులు. అయితే మరణానికి గల కారణాలు మాత్రం తెలపలేదు. హార్ట్ ఎటాక్ తోనే చనిపోయినట్లు భావిస్తున్నామన్నారు పోలీసులు. వార్న్ కి సంబంధించిన వస్తువులు పోయినట్లు.. ఘర్షణ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వార్న్ కు ఛాతీ నొప్పి కలిగిందని, తిరిగి వచ్చాక హాస్పిటల్ వెళ్లాలనుకున్నాడని తెలిపారు అతని తండ్రి. 52 ఏళ్ల షేన్ వార్న్ శుక్రవారం థాయ్ లాండ్ లోని ఓ విల్లాలో అనుమానాస్పద మృతి చెందాడు. దీంతో సహజ మరణమా.. హత్యా.. అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం వార్న్ ది సహజమరణంగా తేల్చారు పోలీసులు. షేన్ వార్న్ డెడ్ బాడీని ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపిస్తారనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు థాయ్ పోలీసులు. 

2 వారాల పాటు కేవలం ద్రవ ఆహారమే తీసుకున్న వార్న్  విహారానికి వెళ్లేముందు ఛాతీ నొప్పి, అధిక చెమట వస్త్తోందన్నాడని తెలిపారు వార్న్ మేనేజర్  జేమ్స్  ఎర్స్ కిన్ . బరువు తగ్గే క్రమంలో వార్న్  పూర్తిగా 14 రోజులు కేవలం ద్రవ ఆహారమే తీసుకున్నాడన్నారు. ఇప్పటివరకూ మూణ్నాలుగు సార్లు ఇలా చేశాడన్నారు. హృదయ సంబంధిత సమస్యతో ఇటీవల వార్న్  ఓ వైద్యుణ్ని సంప్రదించాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. 

చారిత్రక మెల్ బోర్న్  క్రికెట్  స్టేడియం........ ఎంసీజీలో ప్రభుత్వ లాంఛనాలతో వార్న్  అంత్యక్రియలు జరగనున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో జరిగే ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకూ ప్రజలు హాజరయ్యే అవకాశముందన్నారు ఆస్ట్రేలియా అధికారులు. కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన తర్వాత వార్న్ డెడ్ బాడీని ఎంసీజీకి తరలిస్తారని సమాచారం. ఇంకా మెల్ బోర్న్ కు వార్న్ డెడ్ బాడీ చేరకపోవడంతో అంత్యక్రియల తేదీని నిర్ణయించలేదు అధికారులు. ప్రధాని స్కాట్  మోరిసన్ , విక్టోరియా ప్రీమియర్  డానియల్  ఆండ్రూస్  అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం.