అజిత్ మాటల్ని నమ్మోద్దు : శరద్ పవార్

అజిత్ మాటల్ని నమ్మోద్దు : శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ముంబైలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​కు, ఆయన అన్నకొడుకైన అజిత్​ పవార్​కు మధ్య ట్విటర్​ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మొత్తం పార్టీ తనవైపు ఉందని అజిత్​ క్లెయిమ్​చేసుకోగా, అజిత్​మాటలు నమ్మొద్దని శరద్​ పవార్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అజిత్​ పవార్​తో కలిసి రాజ్​భవన్​కు వెళ్లిన తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు తిరిగి శరద్​ పవార్ దగ్గరికి వచ్చేశారు. ఆదివారం రినాయిసెన్స్​ హోటల్​లో జరిగిన సమావేశానికి 50 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిస్సైన నలుగురిలో ఇద్దరు తమతో టచ్​లోనే ఉన్నట్లు ఎన్సీపీ నేతలు చెప్పారు. మూడు పార్టీల ఐక్యతకు గుర్తుగా ఆదిత్య థాక్రే ఇంకొందరు నేతలతో దిగిన ఫొటోలను పవార్​ తనయ సుప్రియా సులే ట్విటర్​లో పోస్ట్​ చేశారు. ‘‘అధికారం ఉండొచ్చు, పోవచ్చు.. ఎప్పటికీ మిగిలేవి అనుబంధాలే’’అంటూ  అజిత్​ పేరెత్తకుండా సుప్రియ పెట్టిన వాట్సాప్​ స్టేటస్ వైరల్​ అయింది.​ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినందుకు విషెష్​ చెప్పిన ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్​ షాకు అజిత్​ పవార్​ థ్యాంక్స్ చెప్పారు.

ఎమ్మెల్యేలకు ఉద్ధవ్​ భరోసా

అనూహ్యరీతిలో ఎన్సీపీ, కాంగ్రెస్​ ఎమ్మెల్యేల భేటీలకు శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే హాజరయ్యారు. శరద్​ పవార్​తో కలిసి ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఉద్ధవ్​.. సేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ మధ్య పొత్తు కచ్చితంగా ఐదేండ్లు నిలబడుతుందని, సర్కారు ఏర్పాటుచేసే బలం కూడా మనకే ఉందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతోనూ థాక్రే ఇదే విషయాన్ని చెప్పారు. శివసేన ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా సమావేశమయ్యారు. ఫ్లోర్​ టెస్టుపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చే ఉత్తర్వులను బట్టి  ఫడ్నవిస్ సర్కారు కూలిపోక తప్పదని థాక్రే ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలిసింది. శనివారం నాటి పరిణామాలతో మహారాష్ట్రలో బీజేపీ పతనం మొదలైందని సేన ఎంపీ సంజయ్​ రౌత్​ అన్నారు. ఫడ్నవిస్​కు సీఎంగా కొనసాగే అర్హతే లేదని, వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్​ చేసింది. మహా వికాస్ కూటమికి ఐదేండ్లూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే సత్తా ఉందని కాంగ్రెస్​ లీడర్​ ఫృథ్విరాజ్​ చవాన్​ అన్నారు. ఉద్ధవ్​ సీఎం కాలేదనే బాధతో వాషిం జిల్లాకు చెందిన రమేశ్ జాదవ్​ అనే శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

ఐదేండ్లూ మేమే ఉంటాం: బీజేపీ

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ఆదివారం ముంబైలోని బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఫ్లోర్​ టెస్టు ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ముందుకెళ్లాలనేదానిపై ఫడ్నవిస్​ నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి పియూష్​ చావ్లా ముంబై బీజేపీ ఆఫీసుకొచ్చి ఫడ్నవీస్​కు విషెస్​ చెప్పారు. హైకమాండ్​కు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతున్న ఫడ్నవీస్​.. పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు పావులు కదుపుతున్నారు. మీటింగ్​తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్​ మాట్లాడుతూ, ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన ప్రతిపక్షాలతో కలిసిందని విమర్శించారు. ఐదేండ్లూ ఫడ్నవీసే సీఎంగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.