8 లక్షల కోట్ల సంపద హాంఫట్​

8 లక్షల కోట్ల సంపద హాంఫట్​

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: స్టాక్ మార్కెట్లు  నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు గత ఏడు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని సోమవారం నమోదు చేశాయి.  ఎప్పటి నుంచో మార్కెట్‌‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసిన బేర్స్‌‌కు, సోమవారం సెషన్‌‌లో కలిసొచ్చింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, బ్యాంకింగ్‌‌ షేర్లు పతనమవ్వడంతో సెన్సెక్స్‌‌  ఇంట్రాడేలో 1,600 పాయింట్ల వరకు పతనమయ్యింది. చివరి గంటలో కొద్దిగా కొనుగోళ్లు జరగడంతో ఈ ఇండెక్స్‌‌ 1,170 పాయింట్లు (1.96 శాతం) నష్టపోయి 58,466 దగ్గర  క్లోజయ్యింది. నిఫ్టీ అయితే కీలకమైన 17,700 లెవెల్‌‌ను కోల్పోయింది. ఈ ఇండెక్స్‌‌ ఇంట్రాడేలో 440 పాయింట్ల వరకు తగ్గింది. చివరికి 348 పాయింట్లు (1.96 శాతం) తగ్గి 17,417 వద్ద ముగిసింది. రూ. 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది.  బ్రాడ్ మార్కెట్ మొత్తం నెగెటివ్‌‌లోనే ట్రేడయ్యింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌లు లాస్‌‌లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌‌యూ, రియల్టీ, మీడియా, బ్యాంక్‌‌, ఆటో ఇండెక్స్‌‌లు 3–4 శాతం మేర పడ్డాయి.  బజాజ్  ఫైనాన్స్‌‌, బజాజ్‌‌ ఫిన్సర్వ్‌‌, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, ఎన్‌‌టీపీసీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీలో 906 షేర్లు లాభాల్లో ముగియగా, 2,498 షేర్లు నష్టపోయాయి. 375 షేర్లు లోవర్ సర్క్యూట్‌‌ను టచ్ చేశాయి.

మార్కెట్‌‌ పడడానికి కారణాలివే..

1) లాక్‌‌డౌన్‌‌ పెడతామని ఆస్ట్రియా ప్రకటించింది. ఈ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జర్మనీ, స్లోవాకియా, చెక్‌‌ రిప్లబిక్‌‌, బెల్జియం వంటి మరికొన్ని దేశాలు కూడా కరోనా రిస్ట్రిక్షన్లను మళ్లీ పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.
2) ఇన్‌‌ఫ్లేషన్‌‌ 2 శాతానికి పైన మరికొంత కాలం కొనసాగుతుందని, యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల కొనుగోళ్లను ఆపాలని  బండస్‌‌బ్యాంక్ (జర్మనీ ఫెడరల్ బ్యాంక్ ) ప్రెసిడెంట్‌‌ జెన్స్ వీడ్‌‌మన్‌‌ పబ్లిక్‌‌గా ప్రకటించారు. దీంతో  వడ్డీ రేట్లు అనుకున్న టైమ్‌‌ కంటే ముందే పెరుగుతాయనే అంచనాలు పెరిగాయి.
3) చైనా రిటెయిల్ సేల్స్ అంచనాలను అందుకోకపోవడంతో  ఏషియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు గ్లోబల్‌‌గా ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో గోల్డ్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. 
4) దేశ ఫారెక్స్ రిజర్వ్‌‌లు నవంబర్‌‌‌‌ 12 తో ముగిసిన వారంలో 763 మిలియన్ డాలర్లు తగ్గి 640.112 బిలియన్ డాలర్లకు పడ్డాయి. అంతకు ముందటి వారంలో 1.145 బిలియన్ డాలర్లు తగ్గి 640.874 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  
ఎనలిస్టులు ఎమన్నారంటే..
1) ‘యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ భయాలతో పాటు,  కరోనా కేసులు పెరుగుతుండడం, కొన్ని డొమెస్టిక్ అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌‌ను దెబ్బతీశాయి. పరిస్థితులకు తగ్గట్టు ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌‌ను మార్చుకోవాలి’ అని ఎనలిస్టు అజిత్‌‌ మిశ్రా చెప్పారు.
2) ‘ఈ కరెక్షన్‌‌తో మార్కెట్లు కన్సాలిడేషన్‌‌ దశ (ఒకే రేంజ్‌‌లో కదలడం) లోకి ఎంటర్ అయ్యాయి. కొన్ని నిర్ధిష్టమైన షేర్లతో ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోని క్రియేట్ చేసుకోవాలి.  వాల్యుయేషన్స్‌‌ ఎక్కువగా ఉన్న షేర్ల నుంచి వాల్యు షేర్లలోకి మనీ వెళుతోంది. అంటే గత కొన్ని క్వార్టర్ల  నుంచి రిజల్ట్స్‌‌ మెరుగ్గా లేకపోయినా, ఇప్పుడిప్పుడు మంచి ఫలితాలను ప్రకటిస్తున్న కంపెనీల షేర్లలోకి డబ్బులు వెళుతున్నాయి’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీ ఫండ్ మేనేజర్‌‌‌‌ అమిత్‌‌ గుప్తా అన్నారు. 
3) ‘అనుకున్నట్టు గానే నిఫ్టీ 17,600 లెవెల్‌‌ను  కోల్పోయింది. ఈ ఇండెక్స్‌‌కు 17,200 లెవెల్‌‌ స్ట్రాంగ్‌‌ సపోర్ట్‌‌గా పనిచేస్తుంది. పైన 18,100–18,200 లెవెల్‌‌ రెసిస్టెన్స్‌‌గా పనిచేస్తుంది. ఈ లెవెల్‌‌ పైన క్లోజయితే తప్ప, మార్కెట్‌‌ పడడమో లేదా ఒకే రేంజ్‌‌లో ట్రేడవ్వడం జరుగుతుంది’ అని దీన్‌‌ దయాళ్​ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ టెక్నికల్ ఎనలిస్ట్‌‌ మనీష్‌‌ హాతిరమాని పేర్కొన్నారు.

ఆరామ్‌కో డీల్‌ పోవడంతో..

రిలయన్స్‌‌-ఆరామ్‌‌కో డీల్‌‌ ఆగిపోవడంతో  రిలయన్స్ షేర్లు సోమవారం 4 శాతానికి పైగా నష్టపోయాయి. కంపెనీ  9 బిలియన్ డాలర్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ను కోల్పోయింది.  అయినా, రిలయన్స్‌‌పై ఎనలిస్టులు పాజిటివ్‌‌గానే ఉన్నారు. కొత్త ఎనర్జీ బిజినెస్‌‌ కోసం కంపెనీ జనరేట్ చేస్తున్న క్యాష్ ఫ్లో సరిపోతాయని అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ షేరు  4.35 శాతం నష్టంతో రూ.2,366 దగ్గర క్లోజయ్యింది. రిలయన్స్‌‌ బోర్డులోకి కూడా ఆరామ్‌‌కో ప్రతినిధి జాయిన్ అవ్వడంతో ఈ డీల్‌‌ పూర్తవుతుందని ఇన్వెస్టర్లు భావించారు. సడెన్‌‌గా డీల్‌‌ ఆగిపోవడంతో నిరుత్సాహపడ్డారని, షార్ట్‌‌ టెర్మ్‌‌లో రిలయన్స్ షేరు నెగెటివ్‌‌గా ట్రేడవుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.  రిలయన్స్ ఆయిల్‌‌ టూ కెమికల్స్ బిజినెస్‌‌లో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ఆరామ్‌‌కో డీల్‌‌ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

పేటీఎంను వెంటాడుతున్న నష్టాలు..

పేటీఎం షేర్లు సోమవారం కూడా భారీగా క్రాష్ అయ్యాయి. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్ షేర్లు ఇంట్రాడేలో 14 శాతం వరకు నష్టపోయాయి. చివరికి 12.74 శాతం పడి రూ. 1,362 వద్ద క్లోజయ్యాయి. దీంతో వరస రెండు సెషన్లలో కంపెనీ షేర్లు 40 శాతం మేర పతనమయ్యాయి. మరోవైపు పేటీఎం గ్రాస్‌ మర్చండైజ్ వాల్యూ (పేటీఎం ద్వారా వ్యాపారస్తులకు జరిగిన పేమెంట్స్‌) కిందటి నెలలో 11.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ ప్రకటించింది. కిందటేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ వాల్యూ 131 శాతం పెరిగిందని కంపెనీ వివరించింది.

రీఛార్జ్‌ రేట్లు పెరిగాయ్​

ప్రీపెయిడ్  ప్లాన్ల రేట్లను భారతీ ఎయిర్‌‌టెల్‌ 20 –25 శాతం మేర పెంచింది. వొడాఫోన్ ఐడియా (వీ) కూడా ఎయిర్‌‌టెల్‌ను ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  కొన్ని నెలల క్రితం  ఎంట్రీ లెవెల్‌ ప్లాన్లు, ఫ్యామిలీ ప్యాక్‌ల రేట్లను ఈ రెండు కంపెనీలు పెంచాయి. తాజాగా  రూ. 79 నుంచి రూ. 2,498  వరకు ఉన్న అన్ని ప్లాన్లపై రేట్లను ఎయిర్‌‌టెల్‌ పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి. రిలయన్స్ జియో, వీ ఇంకా  టారిఫ్‌ల రేట్లను పెంచలేదు. టారిఫ్‌ల రేట్లు పెంచడంతో ఎయిర్‌‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు సోమవారం లాభాల్లో ముగిశాయి.