సీజన్‌‌కు సరిపడా పత్తి సీడ్స్ సిద్ధం చేయాలి: తుమ్మల

సీజన్‌‌కు సరిపడా పత్తి సీడ్స్ సిద్ధం చేయాలి: తుమ్మల
  •     నకిలీ విత్తనాలు మార్కెట్‌‌లోకి రాకుండా అడ్డుకోవాలి: తుమ్మల 
  •     కేంద్రం నిర్ణయించిన ధరలకే సీడ్స్ అమ్మాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్‌‌లో రైతులకు అవసరమైన పత్తి విత్తనాలు సిద్ధం చేయాలని, నకిలీ విత్తనాలు మార్కెట్‌‌లోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌‌లో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగ వుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు చెప్పారు. సాగుకు సరిపడా కాటన్ సీడ్స్‌‌ను మే నెలాఖరు నాటికి రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈయేడు పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ.864గా నిర్ణయించిదని, ఏ డీలరైనా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే సీడ్ కంపెనీలను ఉపేక్షించబోమన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించేది లేదని, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. 2021లో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వగా, 2023 నాటికి 45.17 లక్షల ఎకరాలకు తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌‌లో పత్తికి డిమాండ్ పెరుగుతున్నందున ఈసారి కాటన్ సాగు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనికి తగ్గట్టుగా విత్తనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. నిరుడు 90 లక్షల కాటన్ సీడ్ ప్యాకెట్లు విక్రయించారని, ఈయేడు 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్‌‌లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఇప్పటికే రెండు దఫాలు అగ్రికల్చర్ అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.