లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, ఫరీద్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ (60) గుండెపోటుతో కన్నుమూశారు. పిలిభిత్ రోడ్డులోని మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం (జనవరి 2) మంత్రి ధరంపాల్ సింగ్‌తో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సిబ్బంది వెంటనే అతడిని పిలిభిత్ రోడ్డులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. జనవరి 1న తన 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న 24 గంటల్లోనే ఆయన మరణించడంతో ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ ఫ్యామిలీతో పాటు అనుచరులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ మరణంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని అన్నారు.
శ్యామ్ బిహారీ లాల్ బ్యాక్ గ్రౌండ్:
పిలిభిత్ రోడ్డులోని శక్తి నగర్ కాలనీకి చెందిన డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన బిహారీ లాల్ 2012లో బీజేపీ టికెట్‌పై ఫరీద్‌పూర్ (రిజర్వ్‌డ్) అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2017లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సియారామ్ సాగర్‌పై విజయం సాధించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫరీద్‌పూర్ నియోజకవర్గం నుంచి రెండవసారి గెలుపొందారు.
