హైదరాబాద్: చట్నీలో బల్లి ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. టిఫిన్ తింటుండగా చట్నీలో బల్లి కనిపించడంతో కస్టమర్లు షాకయ్యారు. జగిత్యాల పట్టణంలోని తాసిల్ చౌరస్తా దగ్గర శివ సాయి టిఫిన్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. శిరీష అనే మహిళా దోశ తింటుండగా చట్నీలో బల్లి వచ్చింది. ఇది చూసి అక్కడున్నావారంతా అవాక్కయ్యారు.
ఈ చట్నీ తిని 8 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్లు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో హోటల్ ముందు కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఇదే టిఫిన్ సెంటర్లో పలుమార్లు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న హోటల్ నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు.
